భద్రాచలం ఆంధ్రాదట..ఏపీ అసెంబ్లీలో వాదన

భద్రాచలం ఆంధ్రాదట..ఏపీ అసెంబ్లీలో వాదన

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాదన

మన ఆదాయంతోనే గుడి కట్టారు.. ఇక్కడి ప్రజలకే సెంటిమెంట్ ఉంది

పులిచింతలనైనా తెచ్చుకోవాలని ప్రభుత్వానికి సూచన

అమరావతి, వెలుగు: భద్రాచలంలోని సీతారాముల ఆలయం తెలంగాణది కాదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ఆలయంపై ఏపీ ప్రజలకు సెంటిమెంట్ ఉందన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ముంపు మండలాలను కొత్తగా ఏర్పడిన ఏపీలో కలపలేదన్నారు. అప్పటి ఏపీ ప్రాంతంలోని ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు.  ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించిన బుచ్చయ్య చౌదరి ఆర్థిక అంశాలపై మాట్లాడుతూ భద్రాచలం ఆలయాన్ని ఉదాహరణగా చెప్పారు.

పిఠాపురం డివిజన్ లో‌ వచ్చిన ఆదాయంతో భక్త రామదాసు భద్రాచలం ఆలయాన్ని కట్టారన్నారు. ఆలయం కూలిపోయే స్థితిలో ఉంటే రాజమండ్రికి చెందిన ఆదిశేషయ్య అనే వ్యక్తి విరాళాలు సేకరించి మళ్లీ నిర్మించారని గుర్తు చేశారు. మునగాల పరగణ  కృష్ణా జిల్లాలో ఉండేదన్నారు. ఏపీ ప్రాంతంలోని ఆదాయాన్ని తీసుకెళ్లి తెలంగాణ ప్రాంతంలో దేవాలయాన్ని కట్టారన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉన్నందున పులిచింతల ప్రాజెక్టునైనా ఏపీ పరిధిలోకి తెచ్చుకోవాలని సూచించారు. గోరంట్ల వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలం ఆలయం, పులిచింతల ప్రాజెక్టులను ఏపీకి ఇచ్చే అంశంపై తెలంగాణ సర్కారుతో ఎందుకు చర్చించలేదన్నారు.