భద్రాచలం, వెలుగు : చర్లలోని ఆస్పత్రిని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డును, ఎమర్జెన్సీ, గైనకాలజీ, పీడియాట్రిక్, లేబర్ రూం, ల్యాబ్, ఫార్మసీ తదితర మౌలిక సదుపాయాలను చూశారు. రికార్డులు తనిఖీ చేశారు. గర్భిణులకు, చిన్నారుల వైద్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఆర్ కొత్తగూడెంలోని ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించారు.
మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు, బర్ఫీ, చాక్లెట్, టీపొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్ప పువ్వు సేకరణ విధానం, నాణ్యత, నిల్వ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవససరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్ప పువ్వుఎండబెట్టేందుకు సోలార్ డ్రయ్యర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ ఉన్నారు.
బొజ్జిగుప్ప స్కూల్‌ను తనిఖీ
దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప స్కూల్‌ను కలెక్టర్ జితేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధనా ప్రమాణాలు, విద్యార్థుల నేర్పును ఆయన సమగ్రంగా పరిశీలించారు. కిచెన్ షెడ్‌ను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో పెంచుతున్న చెట్ల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకుని అభినందించారు.

