కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

దాదాపు పది రోజుల క్రితం రాజయ్యకు జ్వరం రావడంతో సొంతూరు సున్నంవారి గూడెంలో చికిత్స అందించారు. అప్పుడు కరోనా టెస్టు చేయగా నెగటివ్ వచ్చింది. పదిరోజులైనా జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ సోమవారం భద్రాచలంలోని ఆస్పత్రిలో మరోసారి టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడకు తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు.

రాజయ్య భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం తరఫున 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009 ఎన్నికల్లో మాత్రం కుంజా సత్యవతి చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. రాజయ్య సొంతూరు ఆంధ్రాలో ఉండటంతో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.

కోవిడ్ నిబంధనల మేరకు ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఆయన నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్లారు. భాగ్యనగర వీధుల్లో అన్న క్యాంటీన్ల వద్ద కూడా భోజనం చేసి కడుపు నింపుకొని అతిసామాన్య జీవితం గడిపిన గొప్పవ్యక్తి రాజయ్య.

For More News..

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి

జాబ్ లేనోళ్లకు ఆసరగా మారిన మాస్క్

మళ్లీ సిటీ బాటపట్టిన వలస కూలీలు