వానలు.. వరదలతో పత్తికి నష్టం.. పంటలు నీటమునిగి కుదేలవుతున్న అన్నదాతలు

 వానలు.. వరదలతో పత్తికి నష్టం.. పంటలు నీటమునిగి కుదేలవుతున్న అన్నదాతలు

భద్రాచలం, వెలుగు :  వరుసగా వర్షాలు, వరదలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రెండు నెలలుగా ఎడతెరిపిలేని వానలు, గోదావరి వరదలు పంటలను ముంచెత్తాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగుల ఒడ్డున రైతులు ఇప్పటికే పత్తి, వరి పంటలను మూడేసి సార్లు సాగు చేసి పూర్తిగా నష్టపోయారు. ఇక మెరక ప్రాంతంలో సాగు చేసిన పత్తి పంటను వరుస వర్షాలు దెబ్బతీశాయి. వర్షాల కారణంగా పత్తి కాయలు, పూత కుళ్లిపోయి, రాలిపోతున్నాయి. కాయల్లోకి నీరు చేరి కాయ నల్లబడి కుళ్లిపోతోంది. దసరా నాటికి మొదటి దశ పత్తి తీత జరిగేది. కనీసం ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు తీసేవారు.  కేంద్రం గిట్టుబాటు ధర రూ.8100 ప్రకటించింది.

 సీసీఐ ద్వారా కొనుగోళ్లకు సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పత్తి చేతికందే దాఖలాలు ఎక్కడా కన్పించడం లేదు. భూమి ఆరక తేమ ప్రభావంతో పత్తిలో పూత, పిందె రాలిపోయింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. వర్షాల కారణంగా ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా పురుగు మందులను మూడుసార్లు పిచికారీ చేశారు. ఎరువులైతే నాలుగైదు సార్లు చల్లాల్సి వచ్చి పెట్టుబడి విపరీతంగా పెరిగింది. కలుపు కూడా వేధించడంతో అష్టకష్టాలు పడి కాపాడుకునేందుకు ప్రయత్నించారు. తీరా ఇప్పుడు పత్తి వచ్చే అవకాశాలు కన్పించక పోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారు. 

భూమి ఆరక.. దుక్కి రాక 

గోదావరి పరివాహక ప్రాంతంలో మిరప సాగు ఎక్కువగా ఉంటుంది. నల్లరేగడి నేలల్లో 25వేల హెక్టార్లలో సాగు చేస్తారు. ఆగస్టులో వరదలు తగ్గాక సెప్టెంబరు నెలలో దుక్కులు దున్ని నెమ్మదిగా పంట సాగును ప్రారంభిస్తారు. అయితే   వాన పడడం, తగ్గి ఆరిపోతుందనుకుంటున్న సమయంలో మళ్లీ వర్షం ఇలా రైతులను ముసురు వేధించింది. రెండు నెలలుగా వాగుల ద్వారా వరద వచ్చి భూములను ముంచెత్తుతోంది. 

రోజుల తరబడి వరద అలాగే ఉండటంతో భూమి ఆరక, దుక్కులు రాక మిరప సాగు కోసం నార్లు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. లక్షల రూపాయలను వెచ్చించి రైతులు మిరప నార్లు పోశారు. అవి వేసేందుకు సిద్ధంగా ఉన్నా అదును కుదరక రైతులు బెంబేలెత్తుతున్నారు. ఈసారి వ్యవసాయం సక్రమంగా సాగే పరిస్థితి కన్పించడం లేదు. అక్టోబర్ నెల కూడా వచ్చేసింది. కానీ వర్షాల పీడ మాత్రం ఇంకా వీడటం లేదు. 

మినుములు, పెసల పంటలు ఖతం

వాగుల తీర ప్రాంతంలో రైతులు సాగు చేసిన మినుములు, పెసల పంటలు పూర్తిగా వర్షాలు, వరదలకు పాడైపోయాయి. ఏమాత్రం చేతికందే పరిస్థితి లేదు. వరదలు తగ్గితే దుక్కులు దున్ని మళ్లీ ఇతర ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలన్నా పెట్టుబడులు ప్రశ్నార్ధకంగా మారాయి.