మంచిర్యాల/ భద్రాచలం : రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో సర్వం కోల్పోయిన జనాన్ని పలకరించేవారే కరువయ్యారు. మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటితుడుపుగా ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చుట్టూ గులాబీ కార్యకర్తలు, పోలీసు బందోబస్తు పెట్టుకుని తిరుగుతున్న లీడర్లు ఆర్థిక సహాయం గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. మరికొందరైతే బాధితులు నిలదీస్తారేమోనన్న భయంతో ముంపు ప్రాంతాల వైపు వెళ్లడానికే జంకుతున్నారు.
కరెంటు లేదు...నీళ్లు లేవు
మంచిర్యాలలో వరద ప్రభావం తగ్గడంతో ముంపు బాధితులు ఇండ్లకు చేరుకుంటున్నారు. చాలా చోట్ల పోల్స్ కూలిపోవడం, కరెంట్ సప్లై వ్యవస్థ దెబ్బతినడంతో పవర్ సప్లై లేదు. నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇండ్లలో పేరుకుపోయిన బుదర, చెత్త క్లీన్ చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. గుంతల్లో నిలిచిన నీళ్లతో ఇండ్లు శుభ్రం చేసుకుంటున్నారు. మరికొందరు ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. కనీసం మున్సిపాలిటీల నుంచి వాటర్ ట్యాంకర్లు పెట్టలేదని మండిపడుతున్నారు.
సర్వం నీటిపాలు
మంచిర్యాలలోని రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చాయి. ఇండ్లలో ఉన్న సరుకులు, ఎలక్ర్టానిక్ పరికరాలు చెడిపోయాయి. దుకాణాలు నీటమునిగి.. అనేక వస్తువులు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు నష్టపోయింది. అయినా ప్రభుత్వం ఇప్పటిదాకా ఆర్థిక సహాయాన్ని ప్రకటించలేదు.
ఎమ్మెల్యే వీడియో డిలీట్ చేయించిన్రు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం కోటపల్లి మండలం దేవులవాడ, సిర్స, అన్నారం తదితర గ్రామాల్లో పర్యటించారు. దేవులవాడలో రైతులు కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నాలుగేండ్లుగా పంటలు నష్టపోతున్నామని, ఇండ్లు మునుగుతున్నాయని వాపోయారు. ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో రెండు గుంటల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. పిటిషన్ ఇస్తే ప్రభుత్వానికి పంపుతానంటూ సుమన్ చెప్పారు. ఇదంతా ఒక యువకుడు మొబైల్లో వీడియో తీస్తుండగా పోలీసులు ఫోన్ తీసుకొని డిలీట్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు ఎమ్మెల్యే చుట్టూ ఉండి తమకు మాట్లాడే అవకాశ ఇవ్వడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలను గోదావరి వరద ముంచింది. జిల్లా, మండలం నుంచి ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి రాలేదని గ్రామస్తులు వాపోయారు. తహసీల్దార్ మోహన్‌రెడ్డిని వివరణ కోరగా... వేలాల, గోపాల్పూర్, బెజ్జాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో గోదావరి బ్యాక్ వాటర్‌లో మునిగిన ఇండ్లు, ఇతర నష్టం వివరాలు సేకరిస్తున్నామన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటనష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు.
బాధితుల ఆవేదన
మంచిర్యాల రాంనగర్‌కు చెందిన మంగ..రూమ్ కిరాయికి తీసుకొని కంగన్ హాల్ నడుపుకుంటోంది. జీవనాధారమైన కంగన్ హాల్ వరదలో నీట మునిగింది. షాప్‌లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. శుక్రవారం షాప్ ఓపెన్ చేసి.. తడిసిన సామాన్లను చూసి బోరున ఏడ్చింది. అప్పు చేసి దుకాణం పెట్టుకున్నానని, రెండు లక్షల నష్టం జరిగిందని వాపోయింది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు వస్తారేమోనని సాయంత్రం దాకా ఎదురుచూసినా ఎవరూ రాలేదని కన్నీరుమున్నీరయ్యింది. సీసీసీ నస్పూర్‌కు చెందిన రేవంత్ రాంనగర్లో కిరాణాషాపు నడుపుతున్నాడు. రాళ్లవాగు ఉప్పొంగి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగింది. సామాన్లన్నీ తడిసిపోయాయి. ఫర్నిచర్, ఫ్రిజ్ ఖరాబయ్యాయి. రూ.10 లక్షల నష్టం జరిగింది. ఇంట్లోని సామాన్లు శుభ్రం చేసుకుందామన్నా నీళ్లు లేకపోవడంతో ఆటోలో సీసీసీలోని ఇంటికి తరలించారు. ఐదేండ్లుగా కిరాణాషాపు నడుపుతున్నామని, కూడబెట్టుకున్నదంతా నీటిపాలైందని అతడి కుటుంబసభ్యులు రోదించారు. రెండేండ్ల కిందట కూడా వరదలొచ్చి షాపులో సామాన్లు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
