ఖైదీలు ఆన్​లైన్​లో ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు

ఖైదీలు ఆన్​లైన్​లో ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు

భద్రాచలం, వెలుగుభద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూన్ 28న ఈ-ములాఖత్ ప్రారంభం ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 30 మంది ఖైదీలకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో ఆన్​లైన్​లో మాట్లాడే వెసులుబాటు కల్పించారు.

ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడేలా..

జైల్లో ఉన్న ఖైదీలతో వారి వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే ముందుగానే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదికూడా కుటుంబంలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. కానీ, ఈ– ములాఖత్ ద్వారా ఆన్​లైన్​లో కుటుంబ సభ్యులందరితో మాట్లాడే వెసులుబాటు కలుగుతోంది. అదికూడా ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంట్లోంచే స్మార్ట్ ఫోన్​లో మాట్లాడుకునే సౌలభ్యం ఉంటోంది. మన్యంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తదితర గిరిజన మండలాల నుంచి కూడా తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచే ఖైదీలతో ముచ్చటిస్తున్నారు. భద్రాచలం జైలును ఈ మధ్యే సందర్శించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వినోద్ .. ములాఖత్‍ ఏర్పాటు చేస్తున్న తీరును చూసి జైలు అధికారులను మెచ్చుకున్నారు.

వీడియో ములాఖత్ ఇలా..

ఈ–-ప్రిసనర్స్ వెబ్‍సైట్ ద్వారా కుటుంబ సభ్యులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ప్రిజన్ పోర్టల్ లింక్ క్లిక్ చేసి, మొబైల్ నంబర్, ఆధార్, ఈ మెయిల్, తాము కలుసుకునే ఖైదీ వివరాలు, వారితో ఉన్న రిలేషన్​షిప్ తదితర వివరాలు ఎంట్రీ చేసి సబ్​మిట్ చేయాలి. ఈ వివరాలను అధికారులు అప్రూవ్ చేసిన తర్వాత .. ముందుగానే మనం ఎంచుకున్న రోజున సంబంధిత ఖైదీతో జైలు అధికారులు ములాఖత్ ఏర్పాటు చేస్తారు. 8 నిమిషాల పాటు  ఖైదీలతో మాట్లాడవచ్చు. ఇలా నెలలో ఎన్నిసార్లు అనేది కూడా అప్లికేషన్‍లో నమోదు చేసిన దాని ప్రకారం అవకాశం కల్పిస్తారు.

అవేర్నెస్ కల్పిస్తున్నాం

వీడియో ములాఖత్‍లపై ఖైదీలకు, వారి కుటుంబ సభ్యులకు అవేర్​నెస్ కల్పిస్తున్నాం. ఖైదీలకు, వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ విధానం చాలాబాగా ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 30 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో ఆన్​లైన్- ములాఖత్ ఏర్పాటు చేశాం. 5 నుంచి 8 నిమిషాల పాటు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నాం. ఈ–ములాఖత్ పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

‑ కె.ఆనందరావు, భద్రాచలం, స్పెషల్ సబ్ జైలు జైలర్