భద్రాచలం ట్రైబల్ మ్యూజియానికి .. సరికొత్త హంగులు

భద్రాచలం ట్రైబల్ మ్యూజియానికి .. సరికొత్త హంగులు
  • కోటి రూపాయలతో ప్రతిపాదనలు
  • మినీథియేటర్.. వాటర్​ ఫౌంటైన్​
  • వెబ్​సైట్​ద్వారా ప్రమోషన్​కు ప్రణాళికలు

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్​మ్యూజియానికి సరికొత్త హంగులు అద్దనున్నారు. కోటి రూపాయలతో ప్రతిపాదనలను తయారు చేశారు. ఇప్పటికే ట్రైబల్​ మ్యూజియానికి విశేష స్పందన లభిస్తోంది. పీవో బి.రాహుల్​ ఆధ్వర్యంలో మ్యూజియంలో ట్రైబల్​హట్స్, చిన్నారులు ఆడుకునేందుకు ఆటలు, బోటింగ్, బాక్స్ బాల్ క్రికెట్, సెల్ఫీ పాయింట్స్, ఆదివాసీల వంటకాలు.. ఇలా రకరకాల ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులంతా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు . 

రాష్ట్ర గవర్నర్​ సహా, మినిస్టర్లు, భద్రాచలం వచ్చే వీవీఐపీలంతా మ్యూజియాన్ని తిలకించి అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ,శిశుసంక్షేమ, పంచాయతీరాజ్​ శాఖ మంతి ధనసరి సీతక్క ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వర్క్​ షాపులో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి దృష్టికి ట్రైబల్ ​మ్యూజియం గురించి తీసుకెళ్లారు. పీవో కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కోటి రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించారు. గత నెల 24, 25తేదీల్లో మోటా(మినిస్టరీ ఆఫ్​ ట్రైబల్​ వెల్ఫేర్​) స్పెషల్ ఆఫీసర్​ సుభాష్​ ఐటీడీఏలోని ట్రైబల్​ మ్యూజియాన్ని సందర్శించి, గిరిజన వంటకాలను తిని ముగ్ధులయ్యారు. కేంద్రం నుంచి రూ.కోటి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రతిపాదనలను తయారు చేసి ఐటీడీఏ పంపించింది. 

మినీథియేటర్.. వెబ్​సైట్​ ద్వారా ప్రమోషన్స్... 

  •   ట్రైబల్​మ్యూజియంలో 18 రకాల అంశాలతో సరికొత్త హంగులు కల్పించాలని ఐటీడీఏ యాక్షన్​ రూపొందించింది. అందులో ప్రధానంగా మినీథియేటర్​ నిర్మాణం ముఖ్యమైనది. 200 మంది కూర్చునేలా వెదురు కుర్చీలు ఏర్పాటు చేస్తారు. టూరిస్టులను ఆకట్టుకునేలా ట్రైబల్​ కల్చర్​ ఫెర్ఫార్మెన్స్ లు చేసేలా  సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకు రూ.20లక్షలు వెచ్చించనున్నారు. 
  •  రూ.1.50లక్షలతో ఒక వెబ్​సైట్​ను తయారు చేస్తారు. ఇందులో ట్రైబల్​ మ్యూజియానికి సంబంధించిన అన్నీ అంశాలను పొందుపరుస్తారు. ఫొటోలు, ఇక్కడ ఉన్న సదుపాయాలు, రూట్​మ్యాప్, ట్రైబల్​ కల్చర్, టూరిస్టులను ఆకట్టుకునేలా వీడియోలు అన్నీ అందులో ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టూరిస్టులను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుంది. 
  •  మ్యూజియంలోనే ఆడియో విజువల్స్, ట్రైబల్ లైఫ్​స్టైల్, ఫెస్టివల్, కల్చర్​ విజువల్స్, డాక్యుమెంటరీలు షూట్​ చేసి అందులో ప్రదర్శించేలా రూ.10లక్షలతో హాలు నిర్మించనున్నారు. 
  • ట్రైబల్​ కల్చర్​కు సంబంధించిన కళాఖండాలు, వస్తువులు సేకరించేందుకు రూ.లక్ష కేటాయించారు. 
  •   ఆర్ట్స్, పెయింట్స్ తో ఆర్ట్స్ గ్యాలరీని రూ.లక్షతో ఏర్పాటు చేయనున్నారు. 
  •   రూ.1.50లక్షలతో లైబ్రరీని ట్రైబల్​ కల్చర్​కు సంబంధించిన పుస్తకాలతో నెలకొల్పనున్నారు. 
  •   12 రూంల్లో 12 ఏసీలను రూ.6లక్షలతో ఏర్పాటు చేస్తారు. రూ.4లక్షలతో ట్రైబల్​ మ్యూజియానికి  రంగులు వేయనున్నారు. 
  •   గిరిజనులు వాడే నగలను ప్రదర్శించేందుకు షోకేష్​లు రూ.6లక్షలతో కొనుగోలు చేస్తారు. 
  •   మ్యూజియం గురించి వివరిస్తూ ఆడియో విజువల్స్ మూడు ప్రాంతాల్లో రూ.6లక్షలతో ఏర్పాటు చేస్తారు. 
  •   డిజిటల్​ టచ్​ స్క్రీన్లు రెండు రూ.50వేలతో కొనుగోలు చేస్తారు. 
  •   ట్రైబల్​ సంస్కృతిని తెలియజేసేలా బొమ్మలను రూ.10లక్షలతో తయారు చేయించి మ్యూజియంలో సందర్శకుల కోసం పెట్టనున్నారు. 
  •   రూ.5లక్షలతో రాత్రి వేళల్లో ఆకర్షించేలా సందర్శకుల కోసం మ్యూజియంకు లైటింగ్​ ఏర్పాటు చేస్తారు. 
  •   మట్టి ఇండ్లు, గిరిజన సంప్రదాయ సముదాయాలను రూ.15లక్షలతో కట్టనున్నారు. 
  •   మ్యూజియం ముందు రూ.1.50లక్షలతో వాటర్​ ఫౌంటైన్​ నిర్మిస్తారు. 
  •   5 కేవీ ఇన్వర్టర్లు 6 బ్యాటరీల పవర్​ బ్యాకప్​తో రూ.3లక్షల నిధులతో ఏర్పాటు చేస్తారు. 
  •   మోడ్రన్​ గేమ్స్, ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​ కోసం రూ.7.50లక్షలు కేటాయించారు. 
  • ఇవన్నీ ఏర్పాటు చేస్తే ట్రైబల్ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. 

అందరూ మెచ్చేలా తీర్చిదిద్దుతున్నాం..

అందరూ మెచ్చేలా ట్రైబల్​ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నాం. కోటి రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశాం. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి మ్యూజియాన్ని తిలకిస్తున్నారు. మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.

బి.రాహుల్, పీవో, ఐటీడీఏ