- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘కోయగూడెం’ పంచాయితీ
- గిరిజన భూ బదలాయింపు చట్టాన్ని పట్టించుకోకుండా గని వేలం వేసిన కేంద్రం
- బ్లాక్‌ను దక్కించుకున్న మెస్సర్స్ ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
- తవ్వకాలు ప్రారంభించకపోవడంతో 2023లోనే టెండర్ రద్దు
- 0.5 శాతం ఎక్సెస్‌కు గనిని తమకు కేటాయించాలని కోరుతున్న సింగరేణి
- రాష్ట్ర ప్రభుత్వం సైతం పలుమార్లు విజ్ఞప్తులు, అయినా పట్టించుకోని కేంద్రం
హైదరాబాద్, వెలుగు : భద్రాద్రి జిల్లా ‘కోయగూడెం ఓసీ 3’ బొగ్గు గని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం గిరిజన భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని పట్టించుకోకుండా ఈ గనిని వేలంలో పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఏడాది గడిచినప్పటికీ సదరు కంపెనీ బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టకపోవడంతో 2023లోనే ఆ టెండర్ రద్దయింది.
దీంతో ఆ టెండర్‌పై మరో 0.5 శాతం ఎక్సెస్ ఇస్తామని, కోయగూడెం గనిని సింగరేణికి కేటాయించాలని సంస్థ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
1/70 యాక్ట్‌ను పట్టించుకోకుండా...
బొగ్గు గనుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం 2015లో వేలం విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలోని అనేక బొగ్గు బ్లాక్‌లను వేలం ద్వారానే వివిధ సంస్థలకు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని ‘కోయగూడెం ఓసీ-3’ బ్లాక్‌ను సైతం వేలం లిస్ట్‌లో చేర్చింది.
ఈ గని ఉన్న ప్రాంతం గిరిజన భూ బదలాయింపు నియంత్రణ చట్టం (1/70) అమల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా.. వేలంలో పెట్టి 2022లో ‘మెస్సర్స్ ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు అప్పగించింది.
1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన సమతా తీర్పు ప్రకారం.. దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న గిరిజన, ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ లీజ్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదు. ఆయా భూముల్లో మైనింగ్‌ను ప్రభుత్వ రంగ సంస్థలు గానీ, గిరిజన సహకార సంఘాలు గానీ చేపట్టాలి. కానీ కోయగూడెం బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థకు కేటాయించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని మొదటి నుంచి పలువురు వాదిస్తూనే ఉన్నారు.
పనులు ప్రారంభించకపోవడంతో రద్దు..
కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌లో సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. వేలంలో బ్లాక్‌ను దక్కించుకున్న సంస్థ నిబంధనల ప్రకారం ఏడాదిలోపు మైనింగ్ పనులు మొదలుపెట్టలేదు. దీంతో ఆ సంస్థకు గని కేటాయింపును 2023లోనే కేంద్రం రద్దు చేసింది. కానీ మైనింగ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటూ సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది.
రూ. 1400 కోట్ల నష్టం
కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించి ఉంటే 2024 నాటికే బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేదని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికి సుమారు 4.8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేదని, రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, పన్నుల రూపంలో సుమారు రూ.150 కోట్లు, సింగరేణికి సంవత్సరానికి రూ. 550 కోట్లు లాభం వచ్చేదని తెలుస్తోంది. ఈ లెక్కన సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు సుమారు రూ.1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ గని ప్రారంభమై ఉంటే సుమారు వెయ్యి మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది. స్థానిక రవాణా, వ్యాపార, సేవా రంగాలకు ప్రోత్సాహం లభించేవి.
సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తులు
కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గనికి సంబంధించిన మైనింగ్ ప్రణాళికలు సిద్ధంగా ఉండడం, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవటం, పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగటం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దృష్టికి తీసుకెళ్లింది. గిరిజన హక్కుల పరిరక్షణ, సింగరేణి భవిష్యత్, తెలంగాణ ఇంధన భద్రత, స్థానిక ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కోయగూడెం ఓసీ-3 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడానికి కేంద్రం సహకరించాలని సీఎం, డిప్యూటీ సీఎం కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ వల్లే వేలంలో పాల్గొనలేదు
కోయగూడెం ఓసీపీ 3 కోల్‌బ్లాక్‌ను కేంద్రం సింగరేణికే కేటాయించాలి. కోయగూడెం ఏరియాలో 1/70 గిరిజన చట్టం అమల్లో ఉన్నందున అక్కడ ప్రైవేట్ కంపెనీ బొగ్గు తీసే అవకాశం లేదు. ఈ బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టడి చేసింది. కాంగ్రెస్ సర్కార్ స్పందించి కోయగూడెంతో పాటు సత్తుపల్లి బ్లాక్‌లు సింగరేణికి దక్కేలా చర్యలు చేపట్టాలి. గత టెండర్‌ను క్యాన్సిల్ చేసి ఈ రెండు కోల్ బ్లాక్‌లు సింగరేణికి చెందేలా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి.- వి.సీతారామయ్య, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్
కేసీఆర్ కుట్ర వల్లే సింగరేణికి నష్టం
కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్ చట్టం తెస్తే బీఆర్‌ఎస్ ఎంపీలంతా మద్దతు తెలిపారు. కోయగూడెం ఓసీపీ 3, సత్తుపల్లి ఓసీపీ బ్లాక్‌లను వేలం వేస్తే అందులో సింగరేణి పాల్గొనకుండా, గనులు ప్రైవేట్ కంపెనీలకు అలాట్ అయ్యేలా కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటికీ బొగ్గు తీయడం లేదు. దీని వల్ల సుమారు రూ.రెండు వేల కోట్ల నష్టం వాటిల్లింది. రెండు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు తీసిన కనీస అనుభవం కూడా లేదు. ఈ బ్లాక్‌లను కేంద్రం సింగరేణికి అప్పగించాలి.
- ఎస్.నర్సింహరెడ్డి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్-
