ముంపు ముప్పులో భద్రాద్రి

ముంపు ముప్పులో భద్రాద్రి

రహదారులు, పలు ఆలయాలు మునక

భారీ వర్షాలతో కళకళలాతుడున్న ప్రాజెక్టులు

నిండుకుండలా ఎల్లంపల్లి, మిడ్ మానేరు

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద

(వెలుగు, నెట్ వర్క్)

రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలాన్ని గోదావరి చుట్టు ముట్టింది. మూడువైపులా నీళ్లు చుట్టు ముట్టగా ఒకవైపు మాత్రమే రహదారి ఉంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు 61.5 అడుగుల వద్ద 20.2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఎగువన తాలిపేరు, దిగువన కిన్నెరసాని, శబరి, సీలేరు ఉపనదులతో పాటు వాగులు, వంకల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. సోమవారం జిల్లాలో 85.96 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏ క్షణమైనా వరద పెరిగే ప్రమాదం ఉందని, గరిష్టం గా 65 అడుగులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి చెప్పారు. ఆలయాలు మునక భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు పునర్వసు మండపం, గోదారమ్మ విగ్రహం నీటమునిగాయి. కల్యాణకట్ట, వైకుంఠధామంలోకి నీళ్లు వచ్చాయి. పలు కాలనీలు సైతం వరదలో చిక్కుకున్నా యి.

భద్రాచలం–జగదల్ పూర్  నేషనల్ హైవే, భద్రాచలం-వెంకటాపురం స్టేట్ హైవేలు మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ఎత్తున వాహనాలు భద్రాచలంలో ఆగిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బెస్తవాడ, ఎస్సీ కాలనీ వాసులను ఐటీడీఏ పునరావాస కేంద్రాలకు తరలించారు. రామన్నగూడానికి చెందిన 300 మందిని కేజీబీవీ హాస్టల్ కి తీసుకెళ్లారు.

ఎల్లంపల్లి గేట్లెత్తారు..

భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌కు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌‌ నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా సోమవారం రాత్రి 9 గంటలకు 19.453 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను అర మీటర్‌‌ మేర ఎత్తి 44,124 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. కాగా, అర్ధరాత్రి సమయంలో మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంది. అయితే గెట్లు ఎత్తినందున గోదావరి తీరంవెంబడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మిడ్ మానేర్ కు భారీగా వరద

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర( మిడ్ మానేర్) ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,552 క్యూసెక్కుల వరద చేరుకుంటు న్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 21.312 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. భారీ వర్షాలతో జగిత్యా ల జిల్లాలోని ధర్మపురి కోటిలింగాల గోదావరి పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది.

పెరుగుతున్న సాగర్ నీటిమట్టం

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ లో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్​ నుండి ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో సోమవారం సాయంత్రానికి సాగర్ లో నీటిమట్టం 568.50 అడుగులకు చేరింది. గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు మరో 22 అడుగుల దూరంలో ఉంది. ప్రాజెక్ట్​లో నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ 252.8110 టీఎంసీలకు చేరింది. మరో 60 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్ట్​ పూర్తిగా నిండుతుంది. ఇదే సమయంలో జూరాల, రోజా ప్రాజెక్ట్​ల నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో శ్రీశైలంప్రాజెక్ట్​లో నీటిమట్టం పెరుగుతోంది. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను 872 అడుగులకు చేరుకుంది.