2006 తర్వాత గోదావరికి ఇదే అతి పెద్ద వరద

2006 తర్వాత గోదావరికి ఇదే అతి పెద్ద వరద

భద్రాచలం : భద్రాచలం మన్యం ద్వీపంగా మారింది. 2006 తర్వాత వచ్చిన అతిపెద్ద వరదగా భావిస్తున్న గోదావరి ఉధృతి శుక్రవారం రాత్రి 70.7  అడుగులకు చేరుకుంది. మరో 0.3 అడుగు మేర పెరిగి , తగ్గుముఖం పడుతుందన్న సీడబ్ల్యూసీ ఆఫీసర్ల నివేదికతో మన్యం కుదుటపడింది. ఎగువన వాజేడు, వెంకటాపురం, మేడిగడ్డల వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో ఆఫీసర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టను తాకుతూ ప్రవహిస్తుండడం, మట్టికట్ట ఇరవై ఏండ్ల కిందిది కావడంతో కలెక్టర్​ కట్ట ప్రాంతాల్లో ఉండే వారిని స్వయంగా ఖాళీ చేయించారు. మైక్​లో అనౌన్స్​చేస్తూ జనాలను అలర్ట్​ చేశారు. సుభాష్​నగర్, అయ్యప్ప కాలనీ వాసులు మాత్రం పునరావాస కేంద్రాలకు తమ ఇంట్లోని సామగ్రి తరలించడానికి ట్రాక్టర్​కు రూ.1000 అడుగుతున్నారని  వెళ్లడానికి ససేమిరా అన్నారు. దీంతో ఆఫీసర్లు వారిని బుజ్జగించి ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. 

చిక్కుకుపోయిన జవాన్లు
వరద వస్తోందని తెలిసినా కూనవరం రోడ్డులో ఉన్న  సీఆర్​పీఎఫ్​ బేస్​ క్యాంపును ఖాళీ చేయించకపోవడంతో 60 మంది చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలోకి వరద చేరింది. బూర్గంపాడు మండలం చుట్టూ వరద చేరడంతో మండల కేంద్రాన్ని ఖాళీ చేయించారు. ఐటీసీ రోడ్డుపైకి కూడా నీళ్లు రావడంతో యాజమాన్యం కర్మాగారాన్ని మూసివేసింది. శనివారం కూడా సెలవు ప్రకటించారు. మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్​పవర్​ స్టేషన్​లోకి వరద నీరు రావడంతో అధికారులు, కార్మికులు ఆందోళనకు గురయ్యారు. సీతమ్మ ప్రాజెక్ట్​ మూడు రోజులుగా వరదనీటిలోనే మునిగి ఉంది. వరద నీటి ఉధృతితో భద్రాచలం వద్ద గోదారి బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించడంతో భద్రాచలం, మణుగూరు, చర్ల, చత్తీస్​గఢ్, ఒడిసా రాష్ట్రాలకు వెళ్లే బస్సులను కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్​లకే పరిమితం చేశారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం ప్రాంతాల్లో ఊళ్ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. 

ఇవేం సహాయక చర్యలు? 
సర్కారు ముందస్తు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని భద్రాచలంలో ముంపు బాధితులు ఆరోపించారు. కరకట్టల రక్షణ విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందన్నారు. అయ్యప్పకాలనీ, బాబా గుడి వెనుక సుభాశ్​నగర్​కాలనీ వైపు కట్టకు లీకులు ఏర్పడంతో ఇసుక బస్తాలు వేసి ఆపేశారు. అంతకుముందు ఈ విషయంలో సీపీఎం ధర్నా చేసింది. ‘ హెలీకాప్టర్లు లేవు ..లాంచీలు లేవు ఇక ప్రజల్ని ఎలా రక్షిస్తారు? ఇవేం సహాయక చర్యలు’ అంటూ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలెక్టర్ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. 

మిషన్​ భగీరథ వాటర్​ సప్లై బంద్​  
భద్రాచలం డివిజన్​లోని కుమ్మరిగూడెం వద్ద ఉన్న మిషన్​ భగీరథ ఇన్​టెక్​వెల్​ సబ్​స్టేషన్​లోని గోదావరి వరద రావడంతో జూలూరుపాడు మండలం తప్ప అన్ని మండలాలకు నీటి సరఫరాను ఆపేసినట్టు మిషన్​ భగీరథ గ్రిడ్​ విభాగం ఈఈసీ నళిని తెలిపారు. పలు స్కూళ్లలో రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం కోసం తెచ్చిన బియ్యం పాడయ్యాయి. 

బాధితుల ఆకలి కేకలు
భద్రాచలం పరిధిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వరద బాధితుల ఆకలికేకలు ఆఫీసర్లకు పట్టడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భోజనాలు పెట్టడంతో చాలామంది ఆకలితో అల్లాడారు. సుమారు ఆరేడు కేంద్రాలకు సంబంధించిన భోజనాల క్యాటరింగ్​ఒక్కరికే ఇవ్వడంతో అన్ని కేంద్రాలకు ఒకేసారి వెళ్లలేకపోతున్నారు. కరెంట్ తీసెయ్యడంతో కేంద్రాల్లో దోమలతో బాధితులు తెల్లార్లు జాగారం చేయాల్సి వస్తోంది. అలాగే సారపాక బంజర దగ్గర ఏర్పాటు చేసిన గోదావరి వరద బాధితుల పునరావాస కేంద్రంలో నీళ్లు, అన్నం అందక బాధితులు ఆందోళన చేశారు. దీంతో పాల్వంచ నుంచి కొందరు దాతలు పులిహోర పొట్లాలు పంపించినా సరిపోని పరిస్థితి నెలకొంది. 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో..
జయశంకర్​ భూపాలపల్లి:  గురువారం అర్ధరాత్రి 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 28.70 లక్షల క్యుసెక్కుల వరద నమోదైంది. ఇది 36 ఏళ్ల తర్వాత రికార్డుగా ఆఫీసర్లు ప్రకటించారు.  భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం గోదావరి వరదల్లోనే చిక్కుకుంది. జిల్లాలోని 5 మండలాలకు మిషన్‌‌ భగీరథ మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మహాదేవ్‌‌పూర్‌‌ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్‌‌ నుంచి అర కిలోమీటర్‌‌ దూరం వరకు వరద నీళ్లు రాగా గోదావరి తీరంలో గల గ్రామాలన్నీ జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని  రామన్నగూడెం, నందమూరి నగర్, ఏటూరునాగారం ఎస్సీ కాలనీ, వోడగూడెం. మంగపేట మండలంలోని  పోద్మూరు, గుడ్డెలుగులపల్లి, కత్తిగూడెం, వాడగూడెం, ఏకే మల్లారం, రమణక్కపేట, రాజుపేట, బ్రాహ్మణపల్లి. వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి ఎస్సీ కాలనీ, మురుమూరు కాలనీ, వాజీదునాగారం, బీసీ కాలనీ, పూసూరు, ఇప్పగూడెం. కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి, వెంకట్రావుపల్లి, కొత్తూరు సర్వాయి (బుట్టాయిగూడెం), గంగుగూడెం, వెంకటాపురం మండలంలోని  వెంగల్రావుపేట, బోదాపురం, పుస్సవానిగూడెం వరద నీటిలోనే ఉన్నాయి.   

భద్రాచలానికి ఒక్క హెలీకాప్టర్​ కూడా రాలే.. 
గోదావరి చరిత్రలోలోనే అతిపెద్ద వరద ముంచెత్తినా భద్రాచలం గోదావరి పరీవాహకప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పునరావాసకేంద్రాల్లో బాధితులకు కనీస వసతులు కల్పించడంతో ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు విఫలమయ్యారు.  గోదావరి నీటిమట్టం 50 అడుగులు దాటగానే ప్రభుత్వం హెలీకాప్టర్లను,లాంచీలను సిద్ధం చేయాలి. కానీ ఇప్పటివరకు రెండు లాంచీలను మాత్రమే తెప్పించారు. ఒక్క హెలీకాప్టర్ కూడా రాలేదు.  ఆఫీసర్లు ఫ్లడ్ మాన్యువల్ ను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. చాలా చోట్ల కరెంట్,  తాగునీటి సప్లై కూడా లేదు. భగీరథ మోటార్లు గోదావరిలో మునగడంతో చాలాప్రాంతాలకు సురక్షిత జలాలు అందడంలేదు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​  కేవలం భద్రాచలంలో మాత్రమే తిరిగారు. మండలాల వైపు ఆయన కన్నెత్తిచూడలేదు. 

సీఎం జాడ ఏదీ
జనం గోదావరి వరదలతో అల్లాడుతుంటే కనీసం సీఎం హెలీకాప్టర్​లో వచ్చి ఏరియల్​ సర్వే చేయడా..? విపత్తుల టైమ్​లో గతంలో సీఎంలు పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చే వారు. లాంచీలు లేవు. హెలీకాప్టర్లు రావు. లోతట్టు గ్రామాలకు సహకారం అందడం లేదు. భోజనాలు మంచిగ ఉండట్లే.కొన్ని చోట్ల పాడైపోయిన అన్నం పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. -  పొదెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం