- జిల్లాలో ఐదు చోట్ల ట్రెక్కింగ్‌కు ఆఫీసర్ల ప్రణాళికలు
- పక్కాగా విప్ప చెట్ల లెక్కింపు.. విప్పపూల సేకరణకు ప్లాన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని గిరిజనులకు జీవనోపాధి కల్పించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో పాటు అడవుల సంరక్షణపై జిల్లా ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. అటవీ ఉత్పత్తులు, ఫారెస్ట్ టూరిజంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని ఫారెస్టులో ఐదు చోట్ల ట్రెక్కింగ్‌కు ఏర్పాటు చేస్తున్నారు. విప్పచెట్లను లెక్కించేందుకు సర్వే నిర్వహించనున్నారు.
అటవీ ఉత్పత్తులపై ప్రత్యేక ప్రణాళికతో..
జిల్లాలో ఉన్న అటవీ ఉత్పత్తులపై కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అపారంగా లభించే విప్పపువ్వు సేకరణతో పాటు విప్ప చెట్ల రక్షణకు ప్లాన్ చేస్తున్నారు. విప్ప చెట్లను లెక్కించేందుకు సర్వే చేపట్టాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. నాణ్యమైన విప్పపువ్వు కిలో రూ. 2వేలు ధర పలుకుతోంది. ఈ క్రమంలో విప్ప చెట్లను రక్షించుకోవడంతో పాటు నాణ్యమైన విప్ప పూల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
విప్ప నూనెకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విప్పపూలు, విప్ప నూనె ఆయుర్వేదంతో పాటు పూజల్లో వాడుతున్నారు. విప్ప పూలతో పాటు తుమ్మ జిగురు, శంకు పుష్పం, కరక్కాయ పొడి, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల సేకరణపై గిరిజనులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విప్పపూలతో తయారు చేసిన లడ్డూలకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనున్నారు. పోడు నరికిన ప్రాంతాల్లో వెదురు చెట్లను పెంచేలా ఆఫీసర్లు రైతులను ప్రోత్సహిస్తున్నారు. మరో వైపు చేపల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఐదు చోట్ల ట్రెక్కింగ్...
జిల్లాలో ఫారెస్టు టూరిజం డెవలప్ మెంట్లో భాగంగా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు, ఇల్లెందులోని ఊరగుట్ట(కోర గుట్ట), మణుగూరు ప్రాంతంలోని రథం గుట్ట, తుమ్మల చెరువు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు ప్లాన్ చేశారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఐదు చోట్ల ట్రెక్కింగ్ మార్గాలను సూచించాలని ఆఫీసర్లను కలెక్టర్ఆదేశించారు. అటవీ చట్టాలకు ఇబ్బందులు లేకుండా ఫారెస్టు టూరిజంపై ఆఫీసర్లు ఫోకస్ పెడుతున్నారు.
ఆయా శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ మీటింగ్..
గిరిజనుల అభివృద్ధి, అడవుల సంరక్షణ, ఫారెస్టు టూరిజంపై కలెక్టరేట్లో రెండు రోజుల కింద పలు శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. కొత్తగా పోడు నరికే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని, అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. జిల్లాలో గొత్తికోయ గిరిజనుల గుంపులు, జనాభా, సౌకర్యాలపై పూర్తి స్థాయిలో నివేధికలను తయారు చేయాలని ఆదేశించారు. అటవీ సంరక్షణ బిల్డింగ్లు నిర్మించి వాటి ద్వారా గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీవనోపాధి కార్యక్రమాలను విస్తృతం చే యాలని సూచించారు.
