ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య పూజలు

ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య పూజలు
  • అవకాశం కల్పించిన భద్రాద్రి దేవస్థానం
  •  టాప్ ఫోలియో యాప్ లో బుకింగ్స్
  • నేటి నుంచేఅమలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తులకు ఆన్‍లైన్లో రామయ్య పూజలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. టాప్ ఫోలియో యాప్‍ ద్వారా భక్తులు తమకు కావాల్సిన సేవలను బుక్‍ చేసుకోవచ్చు. పూజల ధరల వివరాలు కూడా ఇందులోనే ఉంటాయి. స్వామి వారి కల్యాణం మినహా కేశవ, సహస్ర నామార్చనలు, భద్రుడి మండపం, రామయ్యకు గర్భగుడిలో అభిషేకం, లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి, నృసింహస్వామి అభిషేకాలు తదితర పూజలు బుక్‍ చేసుకోవచ్చు. గోత్రనామాల పేరిట పూజలు చేసి భక్తులకు మెసేజ్‍ రూపంలో తెలియపరుస్తారు. ఆర్జిత ఆన్‍లైన్‍ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని దేవస్థానం ఈవో గదరాజు నర్సింహులు సూచించారు. ఆన్లైన్ పూజలతో పాటు కూలీలు, యాచకులకు సాంబారు, పెరుగన్నం వితరణను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 300 మందికి భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

తలంబ్రాలకు ఆదరణ..

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణాన్ని రద్దు చేసిన సంగతి విదితమే. భక్తులు లేకుండానే అర్చకులు కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణ తలంబ్రాలను భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏప్రిల్‍ 2న ఆన్‍లైన్‍లో తలంబ్రాల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍రెడ్డి ప్రారంభించారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 10,500 మందికి పైగా భక్తులు ఆన్‍లైన్‍లో తలంబ్రాల కోసం బుక్‍ చేసుకున్నారు.