రాములోరి పట్టాభిషేకంలో పాల్గొననున్న తమిళిసై దంపతులు

రాములోరి పట్టాభిషేకంలో పాల్గొననున్న తమిళిసై దంపతులు

 

భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: రాష్ట్ర గవర్నర్‌‌‌‌ తమిళిసై సోమ, మంగళవారాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ నుంచి రైలులో బయలుదేరి సోమవారం పొద్దుగాల 4.15 గంటలకు కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌‌) రైల్వేస్టేషన్‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇల్లెందు క్రాస్‌‌ రోడ్‌‌లోని సింగరేణి గెస్ట్‌‌ హౌస్‌‌కు వెళ్తారు. తర్వాత ఉదయం 9 గంటలకు గవర్నర్‌‌‌‌ దంపతులు భద్రాద్రిలో సీతారాముల పట్టాభిషేకంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని దమ్మపేట మండలం నాచారంలోని జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి గుడిని దర్శించుకొని గెస్ట్‌‌​హౌస్‌‌కు చేరుకుంటారు. 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో గవర్నర్‌‌‌‌ పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అశ్వాపురంలోని హెవీ వాటర్‌‌‌‌ ప్లాంట్‌‌ను సందర్శిస్తారు. రాత్రి 10 గంటలకు కొత్తగూడెం చేరుకొని, అక్కడి నుంచి రైలులో సికింద్రాబాద్‌‌కు బయలుదేరుతారు. 

ఇచ్చిన మాట కోసం...

దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో వివిధ ప్రాంతాలకు చెందిన కొండరెడ్లతో గవర్నర్​ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆదిమజాతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న గవర్నర్.. పూసుకుంట గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కొండరెడ్ల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై గతంలో పీఏ భవానీశంకర్ పర్యవేక్షణలో ఆమె సర్వే చేయించారు. గిరిజన జాతుల జీవనస్థితిని గుర్తించిన గవర్నర్ గిరిపోషణ కార్యక్రమం ప్రారంభించారు. పూసుకుంటలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా పౌష్టికాహారంతో పాటు మెడికల్ కిట్స్ అందజేశారు. ఆరునెలల క్రితం సర్వే జరిగిన సమయంలో గ్రామ సర్పంచ్ దుర్గమ్మతో గవర్నర్ ఫోన్​లో మాట్లాడారు. ఆ సమయంలో తమ గ్రామానికి రావాలని గవర్నర్​ను సర్పంచ్ ఆహ్వానించారు. అప్పుడు ఇచ్చిన మాట కోసమే ఆమె భద్రాచలం పర్యటన సందర్భంగా పూసుకుంటకు వెళ్తున్నారు. గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్​కు గవర్నర్​శంకుస్థాపన చేయనున్నారు.