కేసీఆర్.. వినాయకుడితో పెట్టుకుంటే ఆగమైపోతవ్

కేసీఆర్.. వినాయకుడితో పెట్టుకుంటే ఆగమైపోతవ్

గణేష్ నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్ మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి ఈ నెల 9న (శుక్రవారం) వినాయకుడి నిమజ్జనం జరుగుతందని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాలను వినాయక సాగర్ కు తీసుకెళ్లనీయకుండా అక్కడక్కడ భక్తులను అడ్డుకుని పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గణేష్ ఉత్సవాలను నీరుగార్చడానికి ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుందన్నారు. 

నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం సహకరించాలని భగవంతరావు కోరారు. హిందూ ఉత్సవాలను అడ్డుకోవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు బతుకమ్మ, బోనాలు, రంజాన్,మొహర్రం, క్రిస్మస్ పండుగల మీద ఉన్న ఉత్సాహం, గణేష్ ఉత్సవాల మీద లేదన్నారు. వినాయకుడితో పెట్టుకుంటే కేసీఆర్ ఆగమైపోతారన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం నిమజ్జనం కార్యక్రమం ప్రశాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులు కడతామన్నారని..ఇప్పటి వరకు నగరంలో ఎక్కడెక్కడ కట్టారో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్ లోనే చేయాలని రేపు నెక్లెస్ రోడ్ పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే..ఎక్కడి విగ్రహాలు అక్కడే పెట్టి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.