గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ‘కింగ్డమ్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాగా, ఈ నెలలో డబుల్ ధమాకా ఇవ్వబోతోంది. అందులో ఒకటి పీరియాడికల్ మూవీ కాగా, మరొకటి లవ్ స్టోరీ.
దుల్కర్ సల్మాన్ కు జంటగా ఆమె నటించిన ‘కాంత’ సినిమా నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ వింటేజ్ లుక్‌లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.
మరోవైపు రామ్‌కు జోడీగా ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రంలో భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రామ్ గర్ల్ ఫ్రెండ్ గా భాగ్య శ్రీ లుక్స్ యూత్ ను ఇంప్రెస్ చేశాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. వివేక్, మెర్విన్ సంగీతం అందించారు. ఇక భాగ్యశ్రీ బోర్సే గతంలో నటించిన రెండు చిత్రాలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కకపోవడంతో ఈ రెండు చిత్రాల విజయాలపై బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను అందుకుంటోంది. ఇప్పటికే మరో రెండు సినిమాలు తన లైనప్‌లో ఉన్నాయి.
