రాజస్థాన్‌‌ సీఎంగా భజన్‌‌లాల్‌‌ శర్మ

రాజస్థాన్‌‌ సీఎంగా  భజన్‌‌లాల్‌‌ శర్మ

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఎంపిక చేసిన బీజేపీ
డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వా
స్పీకర్‌‌‌‌గా వాసుదేవ్ దేవ్‌‌ నాని పేరు ఖరారు

జైపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేసిన బీజేపీ.. ఆయా రాష్ట్రాల సీఎంల ఎంపిక విషయంలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్‌‌ మాదిరే రాజస్థాన్‌‌లోనూ సీనియర్లను కాదని కొత్త వ్యక్తికే పగ్గాలు అప్పగించింది. అది కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌‌లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేసింది. దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వాను డిప్యూటీ సీఎంలుగా నియమించింది. స్పీకర్‌‌‌‌గా వాసుదేవ్ దేవ్‌‌నాని పేరును ఖరారు చేసింది.  మంగళవారం జైపూర్‌‌‌‌లో జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు.. బీజేఎల్పీ నేతగా భజన్‌‌లాల్‌‌ను ఎన్నుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, పార్టీ అబ్జర్వర్లు వినోద్ తావ్డే, సరోజ్ పాండే, ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ మీటింగ్‌‌కు హాజరయ్యారు. 

వారం రోజుల ఉత్కంఠకు తెర

రాజస్థాన్‌‌లోని 199 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకుంది. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీఎం ఎంపికపై సందిగ్ధత కొనసాగుతున్నది. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ కొనసాగింది. మాజీ సీఎం వసుంధర రాజే, దియా కుమారి సహా పలువురు పోటీ పడ్డారు. కానీ ఆశ్చర్యకరంగా సంగనేర్‌‌ నుంచి తొలిసారి గెలిచిన 56 ఏండ్ల భజన్‌‌లాల్‌‌ను ఎంపిక చేసినట్లు రాజ్‌‌నాథ్ ప్రకటించారు. అంతకుముందు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌‌లో భజన్‌‌లాల్‌‌ పేరును వసుంధర రాజే ప్రతిపాదించారు. లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌‌కు ముందు ఎమ్మెల్యేలు గ్రూప్ ఫొటో దిగగా.. భజన్‌‌లాల్ చివరి వరుసలో నిలబడి ఉండటం గమనార్హం.

కంచుకోటలో పోటీకి నిలబెట్టి

పాలిటిక్స్‌‌లోకి రాకముందు బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో భజన్‌‌లాల్ శర్మ పని చేశారు. రాజస్థాన్‌‌ బీజేపీలో అత్యధిక కాలం జనరల్ సెక్రటరీగా పని చేశారు. నాలుగు సార్లు ఆ పదవిని చేపట్టారు. రాజస్థాన్‌‌లో పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ఆయన వెళ్తుంటారు. కానీ లో ప్రొఫైల్‌‌ మెయింటెయిన్ చేస్తుంటారు. పీజీ వరకు చదివిన భజన్‌‌లాల్‌‌కు రూ.1.5 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నిజానికి భజన్‌‌లాల్ శర్మది భరత్‌‌పూర్ జిల్లా. కానీ అక్కడ ఆయన గెలిచేందుకు అనువైన సీటు లేదన్న కారణంతో జైపూర్ జిల్లాలోని సంగనేర్‌‌ నుంచి హైకమాండ్ పోటీలో నిలిపింది. సంగనేర్‌‌.. బీజేపీ కంచుకోట. అక్కడ 48 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భజన్‌‌లాల్ గెలుపొందారు. 

మరో డిప్యూటీగా దళిత నేత

కుల సమీకరణాల్లో భాగంగా ప్రేమ్ చంద్ భైర్వాకు డిప్యూటీ పదవి దక్కింది. బ్రాహ్మణుడిని సీఎంగా, రాజ్‌‌పుత్‌‌ వర్గానికి చెందిన మహిళను డిప్యూటీగా నియమించిన నేపథ్యంలో.. దళిత నేత అయిన భైర్వాకు అవకాశం వచ్చింది. డుడు సీటు నుంచి ఆయన విజయం సాధించారు. నిజానికి భైర్వా కమ్యూనిటీ.. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉంది. ఈ నేపథ్యంలో 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ప్రేమ్‌‌ చంద్‌‌ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది.

డిప్యూటీ సీఎంగా దియాకుమారి

సీఎం పదవి కోసం పోటీపడిన వారిలో జైపూర్ రాజ కుటుంబ సభ్యురాలు దియా కుమారి కూడా ఒకరు. అయితే బీజేపీ హైకమాండ్ ఆమెను డిప్యూటీ సీఎంగా నియమించింది. 2013లో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే (సవాయ్ మధోపూర్)గా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో ఎంపీ (రాజసమంద్)గా, తాజాగా 71 వేల ఓట్లతో మరోసారి ఎమ్మెల్యే (విద్యాధర్ నగర్)గా ఆమె గెలుపొందారు. మూడు ఎన్నికల్లో మూడు వేర్వేరు సీట్ల నుంచి ఆమె విజయం సాధించడం గమనార్హం. కాగా, 1971 ఇండియా– పాకిస్తాన్ యుద్ధ వీరుడు, లెఫ్టినెంట్ కర్నల్, టెన్త్ పారాచ్యూట్ రెజిమెంట్‌‌లోని పారా కమాండోలకు కమాండింగ్‌‌ ఆఫీసర్, జైపూర్ రాజ కుటుంబీకుడు సవాయ్ భవానీ సింగ్ కూతురు. జైపూర్ చివరి రాజు రెండో మాన్ సింగ్ మనుమరాలైన దియా కుమారి  పలు ఎన్జీవోలను నిర్వహిస్తున్నారు.