రేపు, ఎల్లుండి భారత్ బంద్

రేపు, ఎల్లుండి భారత్ బంద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 28, 29 తేదీల్లో భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా పలు రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో భాగం కానున్నారు. ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు భారత్ బంద్ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతున్నాయి. 

దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్ రంగం పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. 28, 29 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొంటున్నట్లు చెప్పాయి.  ఆయా యాజ‌మాన్యాల‌కు ఇప్పటికే ఆ సంఘాలు నోటీసులు అంద‌జేశాయి. మార్చి 28, 29 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.