అలప్పుజలో  కొనసాగుతున్న రాహుల్ యాత్ర

అలప్పుజలో  కొనసాగుతున్న రాహుల్ యాత్ర
  • నిరుద్యోగుల గొంతులను ఏకంచేస్తున్నం
  • భారత్ జోడో యాత్రలో రాహుల్
  • కేరళలోని అలప్పుజలో  కొనసాగుతున్న యాత్ర

అలప్పుజ: ‘‘ఇవి కేవలం ఫోటోలు  మాత్రమే కావు. దేశంలోని ప్రతి సామాన్యుడి భావాలు.. ఆశలు, వాళ్ల ఐక్యత, బలం, ప్రేమ” అని తాను కలిసినవారితో తీసిన ఫొటోలను షేర్ చేస్తూ రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘సామరస్యంలేకుండా పురోగతి లేదు. పురోగతి లేనిదే ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తు ఉండదు. నిరుద్యోగం సంకెళ్లను విడిపించేందుకు నిరాశలో ఉన్న గొంతులను భారత్ జోడో యాత్ర ఏకంచేస్తోంది” అని పేర్కొన్నారు. ఆయన వెంట  కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్ సురేశ్, ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ తదితరులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రాహుల్ యాత్ర ఎర్నాకుళం జిల్లాకు.. 23న త్రిస్సూర్ చేరుకోనుంది. సెప్టెంబర్ 26, 27న పాలక్కడ్, 28న మలప్పురంలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.

పార్టీకి రాహులే అధ్యక్షుడు కావాలె: 
చత్తీస్​గఢ్, రాజస్థాన్ పీసీసీల తీర్మానం

రాహుల్ గాంధే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండాలంటూ రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేశాయి. వాటి కాపీలను ఆదివారం ఏఐసీసీకి పంపించాయి. రాజస్థాన్ పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీటింగ్​లో తీర్మానాన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించారు. 400 మంది పీసీసీ ప్రతినిధులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అదేరీతిలో చత్తీస్ గఢ్ లోనూ ఏకగ్రీవంగా 300 ఓట్లతో తీర్మానాన్ని శనివారమే ఆమోదించారు. అన్ని రాష్ట్రాలు ఇలాగే రెజల్యూషన్లు చేస్తే బాగుంటుందని సీఎం భూపేశ్ బఘేల్​  తెలిపారు. అలాగే రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయాలని గుజరాత్ కాంగ్రెస్ ఆదివారం డిమాండ్ చేసింది.