మేడిగడ్డ సిగ్గుపడుతుంది!

మేడిగడ్డ సిగ్గుపడుతుంది!

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్చి 1న చలో మేడిగడ్డ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ  ముఖ్య నాయకులు 150 నుంచి 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించారు. తెలంగాణకు కాళేశ్వరం కామధేనువని, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వివరిస్తూ, కుట్రల్ని బయటపెడతామన్నారు.

 చిన్న డ్యామేజీని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతుందని పొలిటికల్ మైలేజ్ కోసం, కచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉందన్న కేటీఆర్.  కాళేశ్వరం మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలని దుర్బుద్ధితో   ప్రభుత్వమే కుట్ర చేస్తున్నట్టు కేటీఆర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత అనేది చర్చించాల్సిన అవసరం ఉంది.

అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగిన వెంటనే, డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్ల బృందం పరిశీలించి సమగ్ర నివేదిక ఇచ్చారు. ‘ప్లానింగ్ ప్రకారం డిజైన్ లేదని, డిజైన్ ప్రకారం నిర్మాణం జరగలేదని,పూర్తయిన బ్యారేజి మెయింటెనెన్స్ ఆపరేషన్ పూర్తిగా మూడేండ్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే మేడిగడ్డ ఐదు ఫీట్లు భూమిలో కుంగింది’ అని స్పష్టంగా ప్రకటించింది.  తెలంగాణను వినాశనం చేసే గిన్నిస్ బుక్ రికార్డు అవినీతి వల్ల కుంగిందని చెప్పకనే చెప్పారు. చౌకైన, గ్రావిటీ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పాతిపెట్టి,  రీ- డిజైనింగ్ తో  కేసీఆర్ మానస పుత్రిక పేరిట కాళేశ్వరానికి మార్చింది, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టడం కోసమే కదా?  

కాగ్​ రిపోర్టులో తేలింది సాంపిల్​ అవినీతి మాత్రమే 

కాగ్ రిపోర్టు ప్రకారం ఈ ఘనమైన ప్రాజెక్టు  నీళ్లు ఇచ్చింది 47 వేల ఎకరాలకే. కాళేశ్వరంలో చేసుకున్న 21 ఒప్పందాలలో కాగ్ పరిశీలించిన కేవలం 4 ఒప్పందాలకు,  మంజూరు చేసినది  రూ.7,212 కోట్లు అయితే, నాలుగింటి వాస్తవ ధర రూ.1,686 కోట్లు మాత్రమే. అంటే ఆ 4 ఒప్పందాల్లో రూ.5,225 కోట్లు రాక్షసంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును క్రూర మృగాల కంటే హీనంగా నమిలి మింగేశారని కాగ్ వెల్లడించింది.  మచ్చుకు కాళేశ్వరంలో ఇది అతి చిన్న అవినీతి. మొత్తం ఒప్పందాల్లో జరిగిన భారీ అవినీతి ప్రస్తావనకు ఇక్కడ స్థలం లేదు. 

మూడో టీఎంసీ పనుల కాంట్రాక్టులో గోల్​మాల్​

స్థాపించిన రెండు టీఎంసీల మౌలిక సదుపాయాలతోనే,  ఏ ఏడాది కూడా180 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయనిది వాస్తవం కాదా? అలాంటప్పుడు 3వ టీఎంసీ 28 వేల కోట్ల మరో ఎత్తిపోతలు ఎందుకు? 28 వేల కోట్ల కాంట్రాక్టు గ్లోబల్ టెండర్లు పిలవకుండా, మెగా కంపెనీ నామినేషన్ పై ఎందుకు ఇచ్చారు? ఆ కంపెనీ పై కేసీఆర్ కు అంతులేని ప్రేమ ఎందుకు? 3వ టీఎంసీలో  కేసీఆర్ కుటుంబం అవినీతి ఎన్ని వేల కోట్లు? 3వ టీఎంసీ డీపీఆర్​ను ​కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే 
28 వేల కోట్ల కాంట్రాక్టు 

నామినేషన్ పై  ఎందుకు కేటాయించినట్లు ? మేడిగడ్డ పియర్లు భూమిలో 5 ఫీట్లు కుంగడానికి బాధ్యత వహించి, సిగ్గుతో తలవంచుకోవాలి. మింగేసిన అవినీతి ని స్వయంగా ప్రకటించి  ప్రజాకోర్టులో  నిలబడితే  భారీ అవినీతి నిర్మూలనకు, ఒక సరికొత్త మార్గం చూపిన వారవుతారు.  అలాకాకుండా చలో మేడిగడ్డ అంటే, కృంగే దుస్థితికి కారణమైన వారే దండయాత్రకు వచ్చారని మేడిగడ్డ సిగ్గుపడి కన్నీరు పెడుతుంది. 

52% నిష్ప్రయోజనమే

 మేడిగడ్డకు వెళితే, ప్రజల్లో ఉన్న కనీస గౌరవం అంతా పోతుందని బీఆర్ఎస్ ప్రముఖులందరి అంతరంగం చెబుతుంది.  అయినా  కుటుంబ నియంతృత్వం పట్టించుకోదు.  కేటీఆర్ కాళేశ్వరంను తెలంగాణకు కామధేనువుగా వర్ణించారు. కాదు అది ఒక గుదిబండ అని, కాళేశ్వరం బతికినంత కాలం తెలంగాణకు అది శనేశ్వరమని చెప్పని నివేదికలు, చెప్పని నిష్ణాతులు,విశ్లేషకులు లేరంటే అతిశయోక్తి కాదు.  

ఒక్క రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు కూడా తిరిగి రాదని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ రుజువులు చాలవా వారు చేసిన విధ్వంసానికి. ఖజానా ఖాళీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 6.71 లక్షల కోట్ల అప్పులై, బిక్షపు పాత్ర చేతికి వస్తే,  మీ కుటుంబం, మెగా యజమాని  ప్రపంచ బిలియనీర్లు అయి ఆకాశానికి ఎదిగారు. సామాన్య ప్రజల భవిష్యత్తు 50 ఏండ్లు వెనక్కి పోయింది నిజం కాదా?  కేటీఆర్​అన్నట్లు కాళేశ్వరం  సమగ్రం కాదు, అదొక తెలంగాణ సమగ్ర  విధ్వంసం. 

ఐదేండ్లలో పంటలకు 60 టీఎంసీలే

ఈరోజు మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయొచ్చు అని అసెంబ్లీలో, బయట చాలా బరితెగించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డ కుంపోయినప్పుడు, డ్యామ్ సేఫ్టీ పరిశీలన కోసం, బ్యారేజీల్లో నీళ్లన్ని వదిలింది సీఎం కేసీఅర్ ప్రభుత్వమే. ఐదేండ్లలో 160 టీఎంసీలు ఎత్తిపోస్తే, పంటకిచ్చిన నీరు కేవలం 60 టీఎంసీలు మాత్రమే. మిగతా 100 టీఎంసీలు ఎదురు గోదారి వరదలకు సముద్రంలో  కలవడమో, ఆవిరైపోవడమో, వృథాగా జలాశయాల్లో ఉండడమో జరిగింది.  అబద్ధాలు ప్రచారం చేసుకోవడం తప్ప, కాళేశ్వరం కింద లక్షల ఎకరాల పంటలు ఎక్కడా పండలేదు. మొత్తం ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలతో పాలించిన ఘనత వారికే దక్కుతుంది.

మిగతా బ్యారేజిలూ కుంగవచ్చు

మేడిగడ్డలాగానే మిగతా రెండు బ్యారేజీలు కూడా భూమిలో కుంగిపోవచ్చని డ్యామ్ సేఫ్టీ ప్రకటించింది.  కుంగిపోవడానికి ముందు బుంగలు పడడం సంకేతం అని డ్యాం సేఫ్టీ చెప్పింది. ఆ బుంగలకు మరమ్మతు చేసి, అన్నారానికి రాబోయే విపత్తును, కేటీఆర్ హరీశ్​ రావు నాయకత్వంలో వెళ్తున్న చలో మేడిగడ్డ వీరులు కంకణం కట్టుకొని నిలువరించాలి. మానస పుత్రికకు జన్మనిచ్చిన తండ్రి,  ప్రపంచ ప్రఖ్యాత మహా ఇంజినీర్  కేసీఆర్ ‘చలో’ కు రాలేదని మేడిగడ్డ వెక్కివెక్కి ఏడుస్తుంది. మానస పుత్రికను కేసీఆర్ కని, పెంపకాన్ని (మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్) పట్టించుకోక నాలుగేండ్లకే మరణావస్థకు(కూల్చి వేయవలసిన) దుస్థితికి దిగజారింది. మేడిగడ్డ పితామహుడి పుణ్యమా అని రోగ గ్రస్థమై మంచం ఎక్కింది. కేటీఆర్ ఏమో వందల మందితో  దండయాత్రకు వచ్చారని మేడిగడ్డ విలపిస్తుంది.

 కడెం ప్రాజెక్టు ఏనాడూ కుంగలేదు

1957లో  కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కేటీఆర్ ఒక ఘోరమైన అబద్ధంతో ప్రపంచం ముందు రికార్డెడ్ గా దొరికిపోయాడు. కడెం ప్రాజెక్టు మొదట తొమ్మిది జర్మనీ గేట్లతో నిర్మించడం జరిగింది. భారీ వరదకు తగ్గట్టు గేట్లు అనాడు మరిన్ని ఎక్కువగా పెట్టకపోవడం వల్ల, అప్పుడు మట్టి కట్ట మాత్రమే కొట్టుకుపోయింది. ఒక్క గేటుకూ అణువంత నష్టం కూడా నాడు జరగలేదు.

 మళ్లీ తర్వాత అదనంగా 9 ఇండియన్ గేట్లు ఆ మట్టి కట్ట స్థానం(1962)లో నిర్మించడం జరిగింది. ఇప్పుడు కడెం ప్రాజెక్టుకు 9 జర్మన్ గేట్లు, తొమ్మిది ఇండియన్ గేట్లు ఉంటాయి. తర్వాత అనేకసార్లు కడెంకి మహా వరదలు డ్యామ్ పైనుంచి ఆరు, ఏడు ఫీట్ల ఎత్తులో వచ్చింది. డ్యాం సిబ్బంది ప్రాజెక్టును వదిలి అనేకసార్లు (కేసీఆర్ పాలనలోనే 2022-–23  రెండుసార్లు)పారిపోయారు. కానీ ఏ రోజు కూడా కడెం ప్రధాన భాగం, మేడిగడ్డ వలె ఐదు ఫీట్లు భూమిలో కుంగలేదు, కడెం పిల్లర్లు అడుగు నుండి పై వరకు ఏ ఒక్కటి బీటలు వారలేదు చెక్కుచెదరలేదు. కడెంకు 80 ఏండ్ల చరిత్ర ఉంది.

మేడిగడ్డ నాలుగేండ్లలోనే చరిత్రలో కలిసిపోయింది. కడెం కేసీఆర్ కనుక కట్టి ఉంటే ఏ రోజో సముద్రంలో తుడిచి పెట్టుకుపోయేది. కేటీఆర్ లాంటి వాళ్లు ఇంత ఘోరమైన అబద్ధాలు, అవాస్తవాలు,  బరితెగించి ఆధునిక సమాజంలో మాట్లాడడం అత్యంత తీవ్రమైన విషయం. ప్రతి బ్యారేజ్ కానీ, ప్రాజెక్టు కానీ భూకంపాలను తట్టుకొని 100 ఏండ్లు నిలుస్తుంది.  దేశంలో నిర్మించిన నాలుగేండ్లకే ఏ ప్రాజెక్టు భూమిలో కుంగిపోలేదు. కానీ ఏ వరద  ప్రవాహం లేనప్పుడు, అక్టోబర్ 21న మేడిగడ్డ ఐదు ఫీట్లు భూమిలో కుంగింది. అంటే ఎంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందో డ్యామ్ సేఫ్టీ విజిలెన్స్ నివేదికల ప్రకారం చూస్తే అర్థమవుతుంది.

శ్వేతపత్రాలే కాదు, అవినీతికి శిక్షలు పడాలి

 డ్యాంలో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదైనా వుంటే వాళ్లపై చర్యలు తీసుకోవడం, ఏ ప్రభుత్వం అయినా చేయవలసిన పని అన్నాడు కేటీఆర్.  కేటీఆర్ న్యాయమైన ప్రశ్ననే ప్రభుత్వానికి వేశాడు. విచారణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కేటీఆర్ అన్నట్టు,  విచారణ జరిపించి, క్రిమినల్స్​ను గుర్తించి,  సొమ్ము రికవరీ చేసి, జైలుకు పంపించే  విషయం ఆలస్యం చేయకూడదు. విచారణ ప్రక్రియను మానేసి పవర్ పాయింట్లనీ, శ్వేతపత్రాలని,  రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ. విచారణ ప్రక్రియలో ఉదాసీనత నిజమే అనిపిస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దలు గమనించాలి.

విచారణలో అలుసు

దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్ కి 2, 3 పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, భూతద్దంలో పెట్టి చూపుతున్నారని కేటీఆర్​ అంటున్నాడు.  నాలుగున్నర కోట్ల సమాజ భవిష్యత్తుని సర్వనాశనం చేసే ఒక ఘోరమైన నేరానికి పాల్పడి, మేము చేయలేదని బుకాయిస్తూ, బరితెగించి ఎదురుదాడి చేయడం, ఎవరేం చేయరనే ఈ విర్రవీగుడు, గత 10 ఏండ్ల అధికారం, నాటి మధ్యయుగాలను తలపించే దురహంకారం కాదా?  కాళేశ్వరం నత్త నడక దర్యాప్తులో చేష్టలుడిగిన నేర విచారణ ప్రక్రియతో ప్రస్తుత పాలకుల ఉదాసీనతే.. ఈ దురహంకారపు బ్రష్టత్వానికి కారణం కాదా? 

‘చలో’ ఒక బూమ్రాంగ్​​

అసెంబ్లీ ఎన్నికల్లో  కేసీఆర్ బీఆర్ఎస్ అధికారం తలకిందులైంది. పార్టీ నాయకులందరూ మూకుమ్మడిగా  జిల్లాలకు తరలిపోతున్నారు. పార్టీ పునాది భూ పలకలు మరో చోటికి వేగంగా  కదిలి పోతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక చలో మెడిగడ్డ పేరిట మరింత  పరాభవానికి గురయ్యే కార్యక్రమం కేటీఆర్ చేపట్టారు. అసలు పథక రచయిత కేసీఆర్ అసెంబ్లీకి, మేడిగడ్డకు రాకుండా దూరంగా ఉన్నారు. చలో మేడిగడ్డ అనే పర్వతం ఓ భారీ కొండ విరిగిపడ్డట్టు, తిరిగి  బీఆర్ఎస్ పార్టీపైనే గురి తప్పకుండా జారి పడుతోంది. దాన్నే బూమ్రాంగ్ గేమ్ అంటారు.​ ఎంపీ ఎన్నికల్లో  ‘చలో మేడిగడ్డ’ బీఆర్ఎస్ ను మరింత కచ్చితత్వంతో విధ్వంసం చేస్తుంది. తెలంగాణ ప్రజలు అన్నింటినీ విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్నారు.

నైనాల గోవర్ధన్, తెలంగాణ జలసాధన సమితి