బీజేపీ రథసారథి .. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడు అద్వానీ

బీజేపీ రథసారథి  ..  దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడు అద్వానీ

న్యూఢిల్లీ: లాల్ కృష్ణ అద్వానీ. దేశ రాజకీయాలను శాశ్వతంగా మలుపుతిప్పిన నాయకుడు. ఒకప్పుడు పార్లమెంట్​లో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీని తన రథ యాత్రలతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించేలా చేసి ఢిల్లీ పీఠమెక్కించిన పోరాట యోధుడు. దేశంలో హిందూత్వ శక్తులను ఏకతాటిపైకి తెచ్చి.. హిందూత్వ, జాతీయవాద ఎజెండాతోనే బీజేపీని దేశమంతటికీ విస్తరించేలా చేసిన ఘనత ఆయన సొంతం. అవిభక్త భారత్ లోని కరాచీ పట్టణం(ప్రస్తుతం పాకిస్తాన్​లో ఉంది)లో ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో1927, నవంబర్ 8న జన్మించారు. 14 ఏండ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్​లో చేరారు. దేశ విభజన తర్వాత ఇండియాకు వచ్చి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. అప్పటి భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతికాలంలోనే ముఖ్య పదవులు పొందారు. జనసంఘ్ నుంచే వాజ్ పేయితో కలిసి నడిచారు అద్వానీ. 1980లో వాజ్ పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. ఇద్దరూ ఐదు దశాబ్దాల పాటు పార్టీ ఎదుగుదలలో మూల స్తంభాలుగా నిలిచారు. బుజ్జగింపు రాజకీయాలు, సూడో సెక్యులరిజంపై విరుచుకుపడ్డారు. తద్వారా హిందూత్వ రాజకీయాలకు తెరతీశారు.  

తీరని కలగా.. ప్రధాని పదవి 

బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించినా.. అద్వానీకి ప్రధాని పదవి మాత్రం కలగానే మిగిలిపోయింది.1995లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా వాజ్ పేయి పేరును ప్రతిపాదించిన వ్యక్తి అద్వానీయే. 2004 ఎన్నికల్లో ఎన్డీయే ఓటమిపాలైంది. 2009లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పేరు తెరపైకి వచ్చినా.. కాంగ్రెస్ కూటమే మళ్లీ గెలిచింది. ఆ తర్వాత పార్టీలో అద్వానీ ఇమేజ్ క్రమంగా మసకబారింది. 2014 ఎన్నికల నాటికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో గెలిచి పీఎం కూడా అయ్యారు. దీంతో అద్వానీ ప్రభకు పార్టీలో శాశ్వతంగా తెరపడినట్లయింది. 2019లో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు.