‘భారత్ సమ్మిట్’కు 70 దేశాల ప్రతినిధులు..రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు నిర్వహిస్తాం : సల్మాన్ ఖుర్షీద్

‘భారత్ సమ్మిట్’కు 70 దేశాల ప్రతినిధులు..రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు నిర్వహిస్తాం : సల్మాన్ ఖుర్షీద్
  • ఢిల్లీలో మీడియాతో సల్మాన్ ఖుర్షీద్, శ్రీధర్ బాబు, మహేశ్ గౌడ్
  • ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకను ఆహ్వానించినట్టు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్–2026’కు 70 దేశాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులు హాజరుకానున్నారని కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనున్న ఈ సమ్మిట్ లో ప్రపంచ సవాళ్లపై చర్చించి, అంతర్జాతీయ సహకారానికి ఒక కొత్త విధానాన్ని అన్వేషించనున్నట్టు తెలిపారు.

మంగళవారం ఢిల్లీ అక్బర్ రోడ్ 24 లోని పార్టీ ఆఫీసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు గుర్దీప్ సప్పల్ తో కలిసి ఖుర్షీద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగనున్న ఈ శిఖరాగ్ర సమావేశం ప్రజాస్వామ్యం, సామాజిక, ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, విదేశాంగ విధానం, మారుతున్న ప్రపంచం వంటి అంశాలపై చర్చలకు వేదికగా మారనుందన్నారు.

ఈ సమావేశానికి లోక్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఇది ప్రయత్నిస్తుందన్నారు. 

‘తెలంగాణ రైజింగ్’ థీమ్​తో...: మంత్రి శ్రీధర్ బాబు

సదస్సులో ‘తెలంగాణ రైజింగ్’ థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.   70 దేశాల నుంచి ప్రముఖులు, నిపుణులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులు ఈ సమిట్ లో పాల్గాంటారని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా చర్చలు కొనసాగుతాయన్నారు.

రాష్ట్ర అభివృద్ధి నమూనాలు, సంక్షేమం, పట్టణీకరణ, ఆర్థిక-సామాజిక న్యాయం, సంస్కృతి, క్రీడలు వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నట్లు చెప్పారు. తద్వారా త్వరలో జరగబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్’లో రాష్ట్ర ఆర్థిక విధానాలను, ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రపంచానికి వివరించి, పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెప్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. 

థింక్ టాంక్ ఐడియా రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే: గుర్దీప్ సప్పల్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అంతర్జాతీయ థింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీదేనని గుర్దీప్ సప్పల్ తెలిపారు. గతేడాది రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన సమయంలోనే ఈ ఆలోచన పురుడుపోసుకుందని గుర్తు చేశారు. రాహుల్ ఆలోచనలనుంచి పుట్టిన ఈ భారత్ సమ్మిట్ ను రెండోసారి నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కడం గర్వకారణమని పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ అన్నారు.