
సిద్దిపేట: రాష్ట్రంలో ఐదుగురు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ముగ్గురిది ట్రాన్స్‌ఫర్ కాగా.. ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్ భారతీ హోళీకేరీని సిద్దిపేటకు బదిలీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరుగా దీర్ఘకాలికంగా పనిచేస్తున్న పి.వెంకటరామిరెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన మెదక్ బాధ్యతలు కూడా అదనంగా చేపడుతుండగా.. అక్కడి నుంచి కూడా రిలీవ్ కావాలని ప్రభుత్వం సూచించింది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనను బదిలీ చేయాలంటూ కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్‌గా భారతి హోలికేరి బాధ్యతలు స్వీకరించారు.