
భూపాలపల్లి రూరల్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం చేసేందుకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనానికి ఆలస్యమవుతున్నది. శుక్రవారం సర్వదర్శనానికి 3 గంటల టైమ్ పట్టింది.
సరస్వతి మాతకు మొక్కుల సమర్పణ
మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్‌లో భక్తులు పుష్కర స్నానాల కోసం తరలివస్తున్నారు. సరస్వతి మాతకు చీరె, సారె, పసుసు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు గైడ్ చేస్తున్నారు.
ఇంకా 10 రోజుల పాటు సరస్వతీ పుష్కరాలు కొనసాగుతాయి. కాగా, రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాల్‌ను ఆ శాఖ డీఐజీ సౌమ్య మిశ్రా శుక్రవారం ప్రారంభించారు. ఖైదీలు తయారుచేసిన టవల్‌ను కలెక్టర్ రాహుల్ శర్మకు బహుమతిగా అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు.