ధరణి అంటే భయపడే పరిస్థితి వచ్చింది

ధరణి అంటే భయపడే పరిస్థితి వచ్చింది

హైదరాబాద్‌‌, వెలుగు : అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌‌పై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. విభజన బిల్లులో రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రభుత్వం కొట్లాడట్లేదని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని భట్టి విమర్శించారు. దీంతో కల్పించుకున్న మంత్రి ఎర్రబెల్లి.. కోచ్‌‌ ఫ్యాక్టరీ, బయ్యారం గురించి పార్లమెంట్‌‌లో కాంగ్రెస్‌‌ ఎంపీలు ఎప్పుడైనా కొట్లాడారా అని ఎదురు ప్రశ్నించారు. సంపద కలిగిన తెలంగాణలో వడ్లు కొనబోమంటే ఎట్లా అని భట్టి నిలదీశారు. వడ్లను కొనాల్సిందేనని డిమాండ్‌‌ చేశారు. దీనికి ముందు కాంగ్రెస్‌‌ పాలిత రాష్ట్రాల్లో కొని చూపించాలని ఎర్రబెల్లి సవాల్‌‌ చేశారు. చత్తీస్‌‌గఢ్​లో మక్కలు కొనకపోవడంతో.. వాళ్లు ఇక్కడికొచ్చి దొంగతనంగా అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. దీంతో చత్తీస్‌‌గఢ్‌‌ పోదామని, సీఎంతో మాట్లాడి తీసుకురావాలని భట్టి సూచించారు. పేదలు ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారని, 8 ఏండ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఇందిరమ్మ ఇండ్లపై చర్చకు సిద్ధమా అని భట్టిని ప్రశ్నించారు. సభను కో ఆర్డినేట్‌‌ చేసుకోవాల్సిన ప్రశాంత్ రెడ్డే హౌస్‌‌ను డిస్ట్రబ్ చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ధరణి అంటే భయపడే పరిస్థితి వచ్చింది: భట్టి

పాత పాలన బాలేదనే తెలంగాణ తెచ్చుకున్నామని, దానితో పోల్చుకునుడేందని భట్టి ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ ఏమైందని, గీత కార్మికుల గురించి ఏం చేస్తున్నారని నిలదీశారు. ధరణి పోర్టల్​ అంటే భయపడే పరిస్థితి వచ్చిందని, తహసీల్దార్‌‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, ధరణి తప్పులు హత్యల వరకు వెళ్తున్నాయని అన్నారు. ఓ మంత్రి హత్యకు సుపారీ తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని మండిపడ్డారు. మంత్రికే భద్రత లేనప్పుడు, సామాన్యుల పరిస్థితేందని ప్రశ్నించారు. ప్రాజెక్ట్​లను అప్పగించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు కోరుతున్నాయని, ఇంకోసారి ఇవన్నీ అక్రమ ప్రాజెక్ట్​లని, పనులు ఆపాలని చెప్తున్నాయని, ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడ్తున్నప్పుడు..భవిష్యత్‌‌లో అనుమతులు పేరు చెప్పి వీటికి అడ్డు తగిలితే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సంగమేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్ట్ నిర్మిస్తున్నదన్నారు. 35 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతున్నట్లు చెప్తున్నారని, దీనిపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని భట్టి డిమాండ్ చేశారు.