స్పీకర్‌‌‌‌‌‌‌‌పై పరుష పదజాలం.. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

స్పీకర్‌‌‌‌‌‌‌‌పై పరుష పదజాలం.. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ కుట్రతోనే అసెంబ్లీపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దాడి
  • సభాపతి తల్లిని దూషించడం
  • తెలంగాణ సంస్కారానికే అవమానం
  • దొరల అహంకారం, పెత్తందారీ పోకడలు ఇంకా పోలేదు
  • ఊరూరా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు దూరం పెట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • దామోదర్ ​రాజనర్సింహ తీర్మానానికి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌పై ప్రతిపక్ష బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు ప్రవర్తించిన తీరు, చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి తల్లిని ఉద్దేశించి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు పరుష పదజాలంతో మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ఒక వర్గానికో, వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, తెలంగాణ సమాజం సంస్కృతి, మహిళల పట్ల మనకున్న గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు.

ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తల్లిని అవమానించడం తెలంగాణ సంస్కారానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌పై దాడిని ఖండిస్తూ మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర్​రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానానికి డిప్యూటీ సీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సభాపతిని అవమానించడం అంటే మొత్తం సభను అవమానించడమేనని, ఇది సభా ధిక్కారానికి సమానమైన వ్యవహారమని అన్నారు. సభాపతిగా గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను అన్నిపార్టీల సభ్యులు ఎన్నుకున్నారని, ఆయనను ఆ స్థానంలో కూర్చోబెట్టి సభను నడిపించే బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు.

ఆయన దళిత వర్గం నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి కావడం అదనపు గౌరవానికి కారణమని, అయితే ఆయనను ‘దళిత స్పీకర్‌‌‌‌‌‌‌‌’గా మాత్రమే చూడటం సరికాదని.. ఆయన మొత్తం శాసనసభకు స్పీకర్‌‌‌‌‌‌‌‌ అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీ భేటీలోనే ఈ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ కాన్స్పిరసీకి తెరలేపారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు అక్కడే పథకరచన చేశారని, ఆ కుట్రలో భాగంగానే కొందరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు రోల్ ప్లేయర్లుగా మారి సభలో ఇలా ప్రవర్తించారని, దీని వెనుక ప్రధాన సూత్రధారులు ఆ పార్టీ అత్యున్నత నాయకత్వమేనని ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయామన్న ఉక్రోషంతో తిరిగి రాష్ట్రాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే దుర్బుద్ధితోనే 
ఈ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కుట్ర ప్రజాస్వామ్యానికే ప్రమాదం..

‎బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అనుసరిస్తున్న విధానం ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ’ని పూర్తిగా దెబ్బతీసేలా ఉందని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇలాంటి కుట్రదారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ‘ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ కుట్ర’ను శాసనసభ పూర్తిగా ఖండించాలని కోరారు. సభాపతిపై జరిగిన ఘటన తర్వాత కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం మరింత బాధాకరమన్నారు. సభలో మళ్లీ సభాపతి స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం, ఆగ్రహంతో ముందుకు దూసుకెళ్లే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిందని గుర్తుచేశారు. వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం దశాబ్దాలుగా పోరాడిందన్నారు. అలాంటి తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్‌‌‌‌‌‌‌‌ మనస్తత్వం, దొరలు, జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారుల ఆలోచనా విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ అందించిన రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన–వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తిగత గౌరవం వంటి విలువలకు ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. ఆ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వివక్ష, అవమానాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.

 మీరు పెట్టిన రూల్స్ మీరే ఉల్లంఘిస్తారా?

‎సభలో టీషర్టులు, నల్లచొక్కాలు ధరించి వాటిపై నినాదాలు రాసుకుని రావడాన్ని కూడా భట్టి తప్పుబట్టారు. గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వమే రూల్ బుక్‌‌‌‌‌‌‌‌లో నిషేధించిందని, తమ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలనే సభాపతి అమలు చేస్తుంటే.. ఆయనపై చిందులు తొక్కడం విడ్డూరంగా ఉందని, రూల్స్ అమలు చేసినందుకే స్పీకర్‌‌‌‌‌‌‌‌ను దూషిస్తారా? అని నిలదీశారు. మేము  పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని,  ఎన్నోసార్లు మాకు మైక్ ఇవ్వలేదని, సభలోకి రాకుండా అడ్డుకున్నారని, సస్పెండ్ చేశారని, కానీ ఏ ఒక్కరోజు కూడా మేం సభాపతి స్థానాన్ని కించపరచలేదని, పరుష పదజాలం వాడలేదన్నారు.

 ప్రజాస్వామ్యాన్ని, స్పీకర్ స్థానాన్ని నిరంతరం గౌరవించామని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలువునా దెబ్బతీస్తోందన్నారు.  తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిందని, అలాంటి గడ్డపై మళ్లీ దొరలు, జాగీర్దారులు, పెత్తందార్ల ఫ్యూడల్ పాలన తెస్తామంటే ప్రజలు సహించరన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని కాలరాసేందుకు చూస్తున్నారని, తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీని శాసనసభలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ప్రజలు బహిష్కరించి, దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.