
కరోనా నేపథ్యంలో గవర్నర్ తమిళ్ సై ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే.. వాటిని ఆచరణలో పెట్టడం మానేసి అధికార పార్టీ నాయకులు గవర్నర్ పై విమర్శలు చేయడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు భట్టి విక్రమార్క. కరోన విజృంభిస్తుందని గవర్నర్ ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారని, వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలని, హాస్పిటల్స్ బెడ్స్ పెంచాలని కొన్ని నెలల క్రితమే ఆ లేఖల్లో పేర్కొన్నారని అన్నారు. గవర్నర్ సూచనలను టీఆరెస్ ప్రభుత్వం బేఖాతర్ చేయడం వల్లనే రాష్ట్రమంతా కరొనా విజృంభించిందని భట్టి అన్నారు.
కరోనా తీవ్రతను ముందే పసిగట్టి కాంగ్రేస్ పార్టీ కూడా ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసిందన్నారు. ప్రతిపక్షాలపై- మీడియా పై ఎదురుదాడి చేసుడే కాకుండా గవర్నర్ ను సైతం ఎదురిస్తారా? అంటూ భట్టి విక్రమార్క ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతర్ చేస్తోందన్నారు. ప్రభుత్వం పై గవర్నర్ విమర్శలు చేస్తే…. విలువలు ఉన్న సీఎంలు గతంలో రాజీనామాలు చేశారని…కేసీఆర్ రాజ్యాంగ విలువలు ఉన్న వ్యక్తి అయితే రాజీనామా చెయ్యాలని భట్టి డిమాండ్ చేశారు. కేసీఆర్ విలువలు లేని వ్యక్తి కాబట్టి- కనీసం గవర్నర్ చెప్పిన సూచనలు అయినా అమలు చేయాలన్నారు. రేషన్ తరహాలో కరోనా బారిన పడిన బీపీఎల్ కుటుంబాలకు కరొనా చికిత్స ఉచితంగా అందించాలన్నారు.
గవర్నర్ తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడటం అభినందనీయమన్నారు భట్టి. గవర్నర్ తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలన్నారు. రాజ్యాంగం సృష్టించిన అధిపతి గవర్నర్- గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.