దేశ సంపదను వ్యాపారుల చేతుల్లో పెట్టారు: డీప్యూటీ సీఎం భట్టి

దేశ సంపదను వ్యాపారుల చేతుల్లో పెట్టారు: డీప్యూటీ సీఎం భట్టి

లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క అన్నారు. జనవరి 11వ తేదీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీలో తెలంగాణ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌లతో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై చర్చించారు. 

అనంతరం భట్టీ విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ .. పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై అధిష్టానం దిశానిర్దేశం చేసిందని తెలిపారు.  తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపొందేలా ప్రణాళికలు, యాక్షన్ ప్లాన్ రూపొందించి పనిచేయనున్నామని...  మెజారిటీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తారని భట్టీ ధీమా వ్యక్తం చేశారు.  సోనియా గాంధీ.. తెలంగాణలో పోటీ చేయాలని ఏఐసీసీని కోరినట్లు తెలిపారు.  సోనియా గాంధీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపామని.. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ  రాష్ట్రంలోనే కాదు.. దేశం అంతటా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.  దేశ సంపదను ప్రజలకు, దేశానికి చెందాలి... కానీ,  అలా కాకుండా కొందరు పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడం సరికాదని ప్రజలు భావిస్తున్నారని భట్టీ విక్రమార్క అన్నారు.