పేదల నుంచి లక్షలకు తీసుకుని..కోట్లకు అమ్ముకుంటవా?

పేదల నుంచి లక్షలకు తీసుకుని..కోట్లకు అమ్ముకుంటవా?

హైదరాబాద్​, వెలుగు: పేదలకు ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్​ కార్పొరేట్లకు పంచుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. 20 వేల ఎకరాల భూములను ఫార్మాసిటీకి ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదల భూములను ఎవరికైనా ఇవ్వాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కురమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన సమావేశమయ్యారు. అంతకుముందు ఫార్మాసిటీ కోసం సర్కారు తీసుకున్న భూములను పరిశీలించారు.

కోట్లకు అమ్ముకునే ప్రయత్నం

రైతుల దగ్గర లక్షలకు భూములు కొంటున్న సీఎం కేసీఆర్​.. కార్పొరేట్లకు కోట్ల రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. రైతుల భూముల జోలికొస్తే కేసీఆర్​ అంతు చూస్తామన్నారు. ‘‘నీలాంటోళ్లను ఎంతో మందిని చూశాం. నువ్వెంత ఆఫ్ట్రాల్​. రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే. వచ్చాక రైతు వ్యతిరేక చట్టాలన్నింటినీ రద్దు చేస్తాం. ముచ్చర్ల ఫార్మాసిటీని రద్దు చేస్తాం. ఈ అంశాన్ని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెడతాం’’అని అన్నారు. చిన్న పరిశ్రమకే ఎంతో కాలుష్యం జరుగుతదని, ఫార్మాసిటీతో వందల కిలోమీటర్ల మేర కాలుష్యం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఫార్మాసిటీ కోసం చేసిన భూ సమీకరణపై వచ్చే నెల 11న ఆందోళనలు, సభ నిర్వహిస్తామన్నారు. రైతులెవరూ భూములివ్వొద్దన్నారు. కేసీఆర్​ తెలంగాణ రాష్ట్రాన్ని అమెరికా కంపెనీలకు కేసీఆర్​ ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.

పేదల భూములు పెద్దలకు: సీతక్క

ఫార్మా సిటీ పేరుతో పేదలకు తక్కువ పరిహారం ఇచ్చి భూములను తీసుకుని పెద్దలకు పంచుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎకరా రూ. ఆరేడు లక్షలకే కొని.. కార్పొరేట్​ కంపెనీలకు రూ. కోటి వరకు అమ్ముతూ కేసీఆర్​ దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు ఎకరా కూడా లేని కేసీఆర్.. వందల ఎకరాల్లో ఫాం హౌస్​ కట్టుకున్నారని, మరి, పేదల దగ్గర రెండు, మూడు ఎకరాలైనా ఉండొద్దా అని ప్రశ్నించారు.

కేసీఆర్​ ఫార్మాసిటీలో కట్టుకో ఇల్లు: జీవన్​రెడ్డి

ఫార్మాసిటీ పేరుతో అడ్డగోలుగా భూసేకరణ చేస్తున్న కేసీఆర్​.. ఆడబిడ్డల కడుపుకొడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విషవాయువులతో బతకలేమన్నారు. గజ్వేల్​లో ఫాం హౌస్​ కట్టుకోవడం కాదని, ఫార్మాసిటీలో కేసీఆర్​ ఇల్లు కట్టుకుంటే తెలుస్తుందన్నారు.

మాకు గిట్టుబాటు కాదు: రైతులు

ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని కాంగ్రెస్​ నేతలకు రైతులు తెలిపారు. వన్​టైం సెటిల్​మెంట్​ ప్రకారం నోటిఫై చేసిన భూముల పరిహారాన్ని గతం లోనే వ్యతిరేకించామని, అధికారులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఎక్కువ పరిహారం ఇవ్వబోమని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లిస్తే ఇప్పుడిస్తామన్న దానికన్నా తక్కువ వస్తుందని భయపెడుతున్నారని వాపోయారు. అసైన్డ్​ భూమికి రూ.8 లక్షలు, పట్టా భూమికి 12.50 లక్షలు ఇస్తున్నారని చెప్పారు. కానీ, మార్కెట్​లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతోందని అన్నారు.