
చేవెళ్ల, వెలుగు: తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ అన్నారు. సోమవారం మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి, మోత్కుపల్లి, చిలుకూరు, షాబాద్ మండల పరిధిలోని గోపిగడ్డ, పోలారం తాండ, పోతుగల్ తాండ, బోడం పహాడ్ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో రెవెన్యూ, ఆర్టీసీ వ్యవస్థను బీఆర్‌ఎస్ నాశనం చేసిందన్నారు. నవాబ్ పేట్ మండలంలోని పేదల భూములను గుంజుకున్నారని, అనుచరుల పేరు మీద భూములను కాలె యాదయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నారు.