- భీమిని, వేమనపల్లి పీహెచ్‌సీలు అప్‌గ్రేడేషన్
- ఫీజిబులిటీ రిపోర్టు పంపిన అధికారులు
- రెండు చోట్ల కొత్తగా డయాలసిస్ సెంటర్లు
- మారుమూల మండలాల్లో వైద్యసేవలు మెరుగు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని భీమిని, వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) త్వరలోనే కమ్యూనిటీ హెల్త్సెంటర్స్(సీహెచ్‌సీ)గా అప్గ్రేడ్కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఇటీవలే ఫీజిబులిటీ రిపోర్ట్అందజేశారు. ఈ రెండు పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్‌చేస్తూ ఐదు బెడ్స్‌తో కొత్తగా డయాలసిస్సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకు అవసరమైన స్థలం, బిల్డింగ్, స్టాఫ్‌తో పాటు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని వైద్యారోగ్యశాఖ నివేదిక కోరింది. ఈ మేరకు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌వో, జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో కూడిన టీం రెండు పీహెచ్‌సీలను పరిశీలించింది. సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని నిర్ధారిస్తూ రిపోర్టు అందజేయడంతో ఇక ఆర్డర్స్రావడమే మిగిలింది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన భీమిని, వేమనపల్లి మండలాలు వైద్యారోగ్య సేవల్లో బాగా వెనుకబడి ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి భీమిని 50 కిలోమీటర్లు, వేమనపల్లి 80 కి.మీ. దూరంలో ఉంటాయి. భీమినికి 24 కి.మీ. దూరంలో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్, వేమనపల్లికి 40 కి.మీ. దూరంలో చెన్నూర్సీహెచ్సీ ఉన్నాయి. అక్కడ కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఏదైనా ఆపదొస్తే జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఈ రెండు మండలాలకు సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. వర్షాకాలంలో అయితే అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని దుస్థితి. లోకల్‌గా ప్రభుత్వ, ప్రైవేట్వైద్యసేవలు అంతంతమాత్రమే కావడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం.
మెరుగపడనున్న సేవలు
భీమిని, వేమనపల్లి పీహెచ్‌సీలను సీహెచ్సీలు అప్గ్రేడ్చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రెండు సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, డాక్టర్లు, స్టాఫ్కొరత వల్ల వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయి. పీహెచ్‌సీల స్థాయిని పెంచడం ద్వారా డాక్టర్లు, సిబ్బంది సంఖ్య పెరగడమే కాకుండా కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నారు.
అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. డెలివరీల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. రెండెకరాల విస్తీర్ణంలో పీహెచ్‌సీలను ఏర్పాటు చేయనుండగా.. భీమినిలో ఇంకా 20 గుంటలు, వేమనపల్లిలో 1.10 ఎకరాల ఖాళీ స్థలం ఉంది.
డయాలసిస్ సెంటర్లు
ఈ రెండు చోట్ల కొత్తగా డయాలసిస్సెంటర్లను ప్రభుత్వం సాంక్షన్చేసింది. ఒక్కో చోట ఐదు బెడ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2011 సెన్సెస్ప్రకారం భీమిని మండలంలో 27,876, వేమనపల్లి మండలంలో 20,124 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరిగింది. ఇటీవల కాలంలో కిడ్నీ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం భీమినిలో 15 మంది, వేమనపల్లిలో 10 మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్లు ఉన్నారు. వందల సంఖ్యలో కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది.
బెల్లంపల్లి, చెన్నూర్‌లో డయాలసిస్సెంటర్లు ఉన్నాయి. కానీ రోజురోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో చాలామందిని వెయిటింగ్‌లిస్టులో పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. పేషెంట్లకు వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్చేయాల్సి ఉంటుంది. దీంతో భీమిని, వేమనపల్లిలో డయాలసిస్సెంటర్లు ఏర్పాటైతే పేషెంట్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
