భోపాల్: మృత్యువు వెంటాడటం అంటే ఇదే కావచ్చేమో.. నడుమ నొప్పి చికిత్స కోసం తెచ్చుకున్న ఎలక్ట్రిక్ థెరపీ మిషన్ ఓ వృద్ధుడు ప్రాణం తీసింది. థెరపీ మ్యాట్‌కు నిప్పుంటుకుని వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
భోపాల్‌కు చెందిన గ్లాడ్విన్ అనే 90 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యుడి సలహా మేరకు నడుము నొప్పి చికిత్స కోసం ఒక ఎలక్ట్రిక్ థెరపీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. నొప్పి నుంచి ఉపశమనం కోసం డైలీ థెరపీ యంత్రాన్ని ఉపయోగించేవాడు. రోజు మాదిరిగానే 2026, మే 27న ఫెయిన్ రిలీఫ్ కోసం ఎలక్ట్రిక్ థెరపీ యంత్రం ఉపయోగిస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే ఆ వృద్ధుడి శరీరం మంటల్లో చిక్కుకుంది. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ఆర్తనాదాలు చేయగా గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గ్లాడ్విన్ మరణించాడు. చికిత్స కోసం తెచ్చుకున్న యంత్రం వల్లే గ్లాడ్విన్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
►ALSO READ | ఎమ్మెల్యేల సంతకం ఫోర్జరీ కేసులో.. అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసులు
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలక్ట్రిక్ థెరపీ మ్యాట్ బ్యాటరీ, అంతర్గత విద్యుత్ వైరింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించిందనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన నిర్దిష్ట సాంకేతిక లోపం లేదా తయారీ లోపాన్ని నిర్ధారించడానికి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
