- భోపాల్‌లో యువకుడి అరెస్ట్.. 2 లక్షల ఫేక్ నోట్లు స్వాధీనం
భోపాల్: ప్రింటర్ సాయంతో దొంగ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువ చేసే దొంగ నోట్లు, ప్రింటింగ్ మెటీరియల్స్, దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది.
కొందరు యువకులు నిజాముద్దీన్ ప్రాంతంలో ఫేక్ రూ.500 నోట్లు చెలామణి చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు.. ఆ ప్రాంతంలో వివేక్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 23 ఫేక్ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
స్టేషన్ తీసుకెళ్లి నిందితుడి ఫోన్ చెక్ చేయగా, అందులో ఫేక్ నోట్స్ ఎలా ప్రింట్ చేయాలనే వీడియోలు కనిపించాయి. ఆ వీడియోలు చూసే తాను ఫేక్ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. ఆన్‌లైన్‌లోనే నోట్ల తయారీకి కావాల్సిన స్పెషల్ పేపర్, బ్లేడ్ తదితరాలను ఆర్డర్ చేసేవాడు. రెండు వైపులా వేర్వేరుగా ప్రింట్ చేసి, ప్రత్యేక గ్లూతో వాటిని అతికించేవాడు.
వాటి మీద ఉన్న వాటర్ మార్క్స్‌ని కూడా అనుమానం రాకుండా చేసేవాడు. గతంలో నిందితుడు ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడు. నిందితుడు రెంట్‌కు ఉన్న ఇంటి నుంచి 428 ఫేక్ రూ.500 నోట్లతో పాటు కంప్యూటర్, పంచ్ మెషీన్, నోట్ కట్టింగ్ డివైజ్, గ్లూ, స్క్రీన్ ప్లేట్స్, కట్టర్స్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
