ఆగస్టు 15 టార్గెట్..! భూ భారతి అప్లికేషన్ల పరిష్కారానికి చర్యలు

ఆగస్టు 15  టార్గెట్..!  భూ భారతి అప్లికేషన్ల పరిష్కారానికి చర్యలు
  • హైకోర్టు నిర్ణయం తర్వాతే సాదాబైనామాల పరిశీలన
  • వేగంగా పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ల ఆదేశాలు 
  • దరఖాస్తు తిరస్కరణకు గురైన రైతులకు వివరణ

ఖమ్మం, వెలుగు: భూభారతి కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు స్పీడప్​ చేశారు. ఆగస్టు 15 నాటికి పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడంతో, టార్గెట్ రీచ్​ అయ్యేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా వచ్చిన సమస్యల వివరాలను తీసుకొని, అందులో సులువుగా పరిష్కారం అయ్యేవాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. అప్లికేషన్ల స్టేటస్​గురించి రెండు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో నేరుగా, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షిస్తున్నారు. అవసరమైన సూచనలు ఇస్తూ, ప్రాసెస్​ ను స్పీడప్ చేయాలని ఆదేశిస్తున్నారు. దరఖాస్తులన్నీ పరిష్కారం అయ్యే వరకు రెవెన్యూ సిబ్బంది సెలవులు తీసుకోరాదని కలెక్టర్లు స్పష్టం చేశారు. 

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 75,004 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సాదా బైనామాకు సంబంధించినవే 41 వేల వరకు ఉన్నాయి. సాదాబైనామాల అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో, వాటిని ప్రస్తుతానికి పక్కనబెట్టారు. మిగిలిన సమస్యలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. పాస్​ బుక్కుల్లోని వివరాల సవరణ, సర్వే నెంబర్లు తప్పుగా పడడం, మిస్సింగ్ సర్వే నెంబర్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, మ్యూటేషన్​, విరాసత్, భూమి స్వభావం మార్పు, అసైన్డ్ పట్టా, పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు వంటి సమస్యలున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 32 వేల మంది దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వగా, 650 అప్లికేషన్లు తిరస్కరించారు. 240 అప్లికేషన్లను పరిష్కరించారు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 51,330 అప్లికేషన్లు రాగా, 34 వేల మంది దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చారు. 100 అప్లికేషన్లను పరిష్కరించగా, 5 దరఖాస్తులను తిరస్కరించారు. ఇక భూమి కొలతల్లో ఎక్కువ తక్కువ ఉన్న వారి సమస్యను లైసెన్సుడ్ సర్వేయర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిష్కరించనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వాటి తీవ్రతను బట్టి మండల స్థాయిలో, రెవెన్యూ డివిజన్​ స్థాయిలో పరిష్కరిస్తున్నారు. 
దరఖాస్తులను వేగంగా పరిష్కారించాలనే ఉద్దేశంతో ఎక్కడా తప్పులు జరగొద్దని ఇప్పటికే మండల, రెవెన్యూ డివిజన్​ స్థాయి అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.

 ప్రతి మండలంలో 10 శాతం దరఖాస్తులను జిల్లా స్థాయిలో ర్యాండమ్ గా చెక్ చేయాలని నిర్ణయించారు. భూ భారతి చట్టం నిబంధనలు పాటించని పక్షంలో బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో వెనకబడిన మండలాలపై ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రతి రోజు మండల తహసిల్దార్ లతో సమీక్షించుకుంటూ, దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి ఉండేలా చూస్తున్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్యానికి మరో వారం రోజులు మాత్రమే గడువుండడంతో ఆఫీసర్లు కూడా స్పీడ్ పెంచారు. 

ఆగస్టు 15 నాటికి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం

భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఈనెల 15 నాటికి పూర్తిగా పరిష్కరించేలా ప్రయత్నిస్తున్నాం. మండల స్థాయిలో ప్రతి రోజూ కొన్ని దరఖాస్తులు పరిష్కారించాలని అధికారులను ఆదేశించాం. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే, దానికి గల కారణాలను కూడా స్పష్టంగా తెలియజేస్తాం. హై కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. 
- అనుదీప్​ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్