హిట్టు.. ఫట్టు

హిట్టు.. ఫట్టు
  • సౌతాఫ్రికా సిరీస్​లో మెప్పించిన భువనేశ్వర్​, ఇషాన్, కార్తీక్​
  • నిరాశ పరిచిన అయ్యర్​, పంత్​

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌: ఈ ఏడాది చివర్లో జరిగే  టీ20 వరల్డ్‌‌ కప్‌‌నకు సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌‌ను తొలి సన్నాహకంగా భావించింది టీమిండియా. ఐపీఎల్‌‌ తర్వాత  సీనియర్లు రోహిత్‌‌, కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి తమ బెంచ్‌‌ బలాన్ని పరీక్షించుకోవాలనుకుంది.   ఈ క్రమంలో సఫారీలపై కొందరు యంగ్‌‌స్టర్లతో పాటు రీఎంట్రీలో మరికొందరు సీనియర్లకు అవకాశాలు లభించాయి.  ఆఖరి మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దు కావడంతో  సౌతాఫ్రికాతో ఇండియా ట్రోఫీని పంచుకుంది. మరి, తమకు వచ్చిన  అవకాశాలను కొందరు సద్వినియోగం చేసుకోగా.. మరికొందరు నిరాశ పరిచారు. 

భువీ భళా.. కార్తీక్​ కేక

ఈ సిరీస్‌‌తో ఎక్కువ లాభపడ్డది యంగ్‌‌ ఓపెనర్‌‌ ఇషాన్‌‌ అనొచ్చు.  ఐపీఎల్‌‌లో తీవ్రంగా నిరాశ పరిచిన ఈ యంగ్‌‌స్టర్‌‌ ఇండియా టీమ్‌‌లోకి రాగానే తన బ్యాట్‌‌ పవర్‌‌ చూపెట్టాడు. రెండు ఫిఫ్టీలు సహా 206 రన్స్‌‌ చేసి  టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు. 150.36 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో బ్యాటింగ్‌‌ చేయడం విశేషం. ఇషాన్‌‌ ఇదే ఫామ్‌‌ను కొనసాగిస్తే వరల్డ్‌‌ కప్‌‌ టీమ్‌‌లో బ్యాకప్‌‌ ఓపెనర్​, కీపర్​గా పనికొస్తాడు. ఇక, గాయం నుంచి కోలుకున్నాక ఐపీఎల్‌‌లో సూపర్‌‌ ఫెర్ఫామెన్స్‌‌ చేసి టీమిండియాలోకి తిరిగొచ్చిన హార్దిక్‌‌ పాండ్యా కూడా ఈ సిరీస్‌‌లో మెప్పించాడు. మిడిల్‌‌ ఓవర్లలో జట్టుకు అవసరమైన పరుగులు అందించాడు. నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో 117 రన్స్‌‌ చేసిన పాండ్యా మీడియం పేస్‌‌ బౌలింగ్‌‌తోనూ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా గుజరాత్‌‌కు టైటిల్‌‌ అందించిన హార్దిక్‌‌ గతానికి భిన్నంగా చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు.  అందుకే ఈ నెల 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌‌తో జరిగే రెండు టీ20లకు కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. మరో రీఎంట్రీ ప్లేయర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ ఫామ్​ అందుకోవడం టీమ్​కు అతి పెద్ద ప్లస్​ పాయింట్​ అనొచ్చు. ఆరు వికెట్లతో ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద  సిరీస్‌‌గా నిలిచిన భువీ  మంచి ఎకానమీ (6.07)తో పాటు కీలక సమయాల్లో వికెట్లు అందించాడు. ఓ మ్యాచ్‌‌లో 4/13 స్పెల్‌‌తో సఫారీలను వణికించాడు.  గుడ్‌‌ లెంగ్త్ డెలివరీలు వేస్తూ, పరుగులు నియంత్రించాడు. నాలుగో మ్యాచ్‌‌లో మెరుపు ఫిఫ్టీ కొట్టిన దినేశ్‌‌ కార్తీక్‌‌... టీమ్‌‌లో ఫినిషర్‌‌ పాత్రకు తనే కరెక్ట్‌‌ అని నిరూపించుకున్నాడు. వరల్డ్​ కప్​ నేపథ్యంలో కోచ్​ ద్రవిడ్​ అతడికి ఫినిషర్ పాత్రే అప్పగించాడు. అందుకే కటక్​లో అక్షర్​ తర్వాత ఏడో నంబర్​లో బ్యాటింగ్​కు పంపించాడు. కోచ్​ నమ్మకాన్ని నిలబెట్టిన డీకే 21 బాల్స్​లో 30 రన్స్​ చేశాడు. ఇక కీలకమైన నాలుగో టీ20లో టీమ్​ను గెలిపించిన కార్తీక్​ తుది జట్టు నుంచి తనను తప్పించలేని పరిస్థితి తెచ్చుకున్నాడు.