భూభారతి దరఖాస్తుల్లో అర్హత లేనివే ఎక్కువ!

భూభారతి దరఖాస్తుల్లో  అర్హత లేనివే ఎక్కువ!
  • పొజిషన్, డాక్యుమెంట్లు లేకుండా అప్లికేషన్లు
  • పైలెట్ మండలం నేలకొండపల్లిలో 3,224 అప్లికేషన్లు
  • సగానికి పైగా దరఖాస్తులు సాదాబైనామావే
  • 2014లోపు సాదాబైనామా ఉన్నవి 1,222 మాత్రమే
  • మిగిలిన 1,433 దరఖాస్తుల్లో 1,134 రిజెక్ట్ 
  • తిరస్కరణకు కారణాలు వివరిస్తున్న ఆఫీసర్లు 

ఖమ్మం, వెలుగు: భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా అర్హత లేనివే ఉన్నాయని అధికారులు గుర్తించారు. మండలంలో ప్రతీ రెవెన్యూ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం అప్లికేషన్లను పరిశీలించి అన్ని పేపర్లతో పాటు అర్హత ఉన్న దరఖాస్తులను వేరు చేశారు. మిగిలిన వాటిని రిజెక్ట్ చేసి, ఎందుకు రిజెక్టు చేశాం అనే సమాచారాన్ని దరఖాస్తుదారులకు 
వివరిస్తున్నారు. 

నేలకొండపల్లిలో మొత్తం 3,224 దరఖాస్తులు.. 

 నేలకొండపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి మొత్తం 3,224 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,791 అప్లికేషన్లు సాదాబైనామావే ఉన్నాయి. ఈ అప్లికేషన్లలో 2014కు ముందు సాదాబైనామాలు 1,222 ఉండగా, 2014 తర్వాతవి 569 ఉన్నాయి. 2014కు ముందు వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని 1,222 దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో 97 మాత్రమే భూమిలో పొజిషన్​ లో ఉండి, డాక్యుమెంట్స్​ సరిగా ఉండి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో 214 దరఖాస్తుదారులు భూమి మీద పొజిషన్​ లో ఉన్నా సరైన డాక్యుమెంట్స్​ లేవు. మరో 911 దరఖాస్తులు భూముల్లో ఫీల్డ్ లో లేరు, సరైన డాక్యుమెంట్స్​ కూడా లేవని గుర్తించారు. దీంతో వాటన్నింటిని రిజెక్టు చేస్తున్నట్టుగా దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చారు. 

 ఇక సాదాబైనామాలు కాకుండా మిగిలిన అప్లికేషన్లు 1,433 ఉన్నాయి. వాటిలో 299 ఫైళ్లను మాత్రమే అప్రూవ్ చేశారు. మిగిలిన 1,134 అప్లికేషన్లు వేర్వేరు కారణాలతో రిజెక్ట్ చేశారు. ఇలా రిజెక్ట్ చేసిన వాటిలో 304 దరఖాస్తులు పాత పాస్​ బుక్ ప్రకారమే కొత్త పాస్​ బుక్​ లు ఇవ్వగా, విస్తీర్ణం కరెక్షన్​ కోసం మళ్లీ అప్లయ్​చేసుకున్నారు. ఇంకో 300 దరఖాస్తులు భూముల్లో పొజిషన్​ లో లేకపోవడం, అసలు భూమి లేకపోయినా కొత్త పాస్​ బుక్​ కోసం దరఖాస్తు చేశారు. ఇంకో 87 దరఖాస్తుదారులు భూమిలో పొజిషన్​ లో ఉన్నారు, కానీ రెవెన్యూ రికార్డుల్లో లేరు, వారి దగ్గర ఎలాంటి నిర్దిష్టమైన డాక్యుమెంట్లు లేకపోవడంతో రిజెక్ట్ అయ్యాయి. ఇలా మొత్తం 26 రకాల కారణాలతో 927 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 

 ఇక అప్రూవ్​ చేసిన దరఖాస్తుల్లో ఎక్కువగా కొత్త పాస్​ పుస్తకం కోసం అప్లయ్ చేసుకున్నవి 155 ఉన్నాయి. విస్తీర్ణం సవరణ కోసం 56 అప్లికేషన్లను, పట్టాదారుని పేరు సవరణ కోసం వచ్చిన వాటిలో 45 దరఖాస్తులను, తండ్రి లేదా భర్త పేరు సవరణ కోసం వచ్చిన వాటిలో 17 అప్లికేషన్లకే గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తప్పించేందుకు 47 అప్లికేషన్లు రాగా ఏడు  ఓకే చెప్పారు. 

రిజెక్టుకు గల కారణాలు వివరిస్తున్న ఆఫీసర్లు 

గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల్లో రిజెక్టు చేసిన వాటికి తగిన కారణాలను దరఖాస్తుదారులకు చెబుతున్నారు. అదే సమస్యపై మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు గాను ఎందువల్ల రిజెక్టు అయిందనే విషయాన్ని వివరిస్తున్నారు. ఇక అప్రూవ్ అయిన దరఖాస్తులకు సంబంధించిన పనులను ఇప్పటికే మొదలుపెట్టామని, విస్తీర్ణంలో మార్పులు, పేర్లలో మార్పులకు సంబంధించి టేబుల్ పైనే అయ్యే పనులను వెంటనే పూర్తి చేస్తున్నామని, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.