భూమిక ప్రధాన పాత్రలో విఘ్నేశ్ గవిరెడ్డి, సారా అర్జున్, నాజర్, రోహిత్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. గుణ శేఖర్ రూపొందించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతున్న క్రమంలో గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ ‘ఇలాంటి చిత్రాలను చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ గుణ శేఖర్ గారు, ఆయన ఫ్యామిలీ రిస్క్ చేస్తున్నారు. నేను సినిమా చూసిన రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయా. అంతలా నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ మెచ్చేలా సినిమా ఉంటుంది. పృథ్వీ, లిఖిత, విఘ్నేశ్ అద్భుతంగా నటించారు’ అని చెప్పారు. గుణ శేఖర్ మాట్లాడుతూ ‘34 ఏళ్ల కెరీర్‌లో ఇది నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడూ అదే ఫీల్‌తో ఉన్నా. ఓ మంచి కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశా. ప్రేక్షకుల డబ్బుని, సమయాన్ని వృథా చేయను. ప్రేక్షకుల విజ్ఞతకి పెద్ద పీట వేసేలా రూపొందించాను. భూమిక ఈ సినిమాకి బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో ఆమె జీవించారు. అడాల్‌సెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ అనే అంశాల చుట్టూ తెరకెక్కించాను. సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. ఇదొక హార్డ్ హిట్టింగ్ మూవీ అని, అందరి హృదయాలను తాకేలా ఉంటుందని నిర్మాత నీలిమ గుణ అన్నారు. నటులు విఘ్నేశ్, లిఖిత, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
