అధికారం లేక హరీశ్​రావుకు నిద్ర పట్టట్లే: కాంగ్రెస్ నేత చామల

అధికారం లేక  హరీశ్​రావుకు నిద్ర పట్టట్లే:  కాంగ్రెస్ నేత చామల

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఓ వీడియోను మీడియాకు రిలీజ్​ చేశారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసి మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్నారన్నారు. ఆయనకంటే సీనియర్ అయిన రాజాసింగ్​ను  కాదని ఈయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. 

యూ టాక్స్ వసూలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. 2014, 2018  అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోనే బీఆర్ఎస్ అమలు చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హరీశ్​రావులా తమకు మాటలు రావని, కానీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. బీఆర్​ఎస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అధికారం లేకుండా హరీశ్​రావు ఉండలేకపోతున్నారని, ఆయనకు నిద్ర కూడా సరిగా పడతలేదన్నారు. అర్థంలేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.