కమీషన్లకు కక్కుర్తి పడి పర్మిషన్లు ఇచ్చింది మీరే : భువనగిరి ఎంపీ చామల

కమీషన్లకు కక్కుర్తి పడి పర్మిషన్లు ఇచ్చింది మీరే : భువనగిరి ఎంపీ చామల
  • భువనగిరి ఎంపీ చామల కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: అక్రమ కట్టడాల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి నాలాలపై ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్  నాయకులేనని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. మధు పార్క్ రిడ్జ్  అపార్ట్‌‌‌‌మెంట్ వాసులను హరీశ్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్న హరీశ్​.. వాస్తవాలను దాచిపెట్టి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ‘‘2012లో ఉన్న జీఓ ప్రకారం చెరువులు, నాలాల వద్ద 30 మీటర్ల బఫర్ జోన్  ఉండాలి.

కానీ, గత బీఆర్ఎస్  ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తిపడి 30 మీటర్లు ఉండాల్సిన చోట కేవలం 9 మీటర్ల బఫర్  చూపించి మధు పార్క్ రిడ్జ్  బిల్డర్లకు పర్మిషన్లు ఇచ్చింది. నాలాల మీద అక్రమంగా అనుమతులు ఇచ్చి, ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే సరిపోదు. గత పాలకులు చేసిన తప్పుల వల్లే  అపార్ట్‌‌మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ప్రజల తప్పేమీ లేదు. అమాయకంగా ఇళ్లు కొనుక్కున్నారు’’ అని చామల అన్నారు.