కరెంట్ ఛార్జీలను ఎన్నికల ముందు ఎందుకు పెంచలే?

కరెంట్ ఛార్జీలను ఎన్నికల ముందు ఎందుకు పెంచలే?

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో నల్గొండ నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శనివారం తిప్పర్తి లో  ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన..  నల్గొండ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆనాడు నల్గొండ ను దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలపై రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని చెప్పారు. కొందరు  పదవుల కోసం పార్టీలు మారి ఆ పార్టీ నేతల కాళ్ళు మొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో అన్ని ఎన్నికలు అయిపోవడంతో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని ఎంపీ విమర్శించారు. అవే ఛార్జీలను ఎన్నికల ముందు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కరెంటు చార్జీలను పెంచితే ఆనాడు చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుందని హెచ్చరించారు.

రైతులకు సంవత్సరానికి 25000 చొప్పున రుణమాఫీకి ఇస్తే వడ్డీలకే సరిపోదని, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణి సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించారన్నారు. ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి.

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Press Meet in Thipparthi