
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటన ఓ రాజకీయ జిమ్మిక్కు అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని చూడడం హుందా అనిపించుకోదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ముగ్గురు ఎంపీలుండగా... అందులో ఒకరు పీసీసీ ప్రెసిడెంట్, మరొకరు మాజీ పీసీసీ ప్రెసిడెంట్ అని తెలిపారు. ఇక మిగిలింది తానేనని వెంకట్ రెడ్డి చెప్పారు. తమను రాజకీయంగా టార్గెట్ చేసిన కేటీఆర్... ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేటీఆర్... రాష్ట్రానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని చెప్పారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు ఆయనను తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వారంతా మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు.