ఇండోర్‌లో టీమిండియా ప్రాక్టీస్
మాంచెస్టర్: టీమిండియాకు శుభవార్త. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న భువీ మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు. దాదాపు అరగంటకు పైగా ఇండోర్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. వెస్టిండీస్‌తో గురువారం జరిగే మ్యాచ్‌కు భువీ ఆడతాడో లేదో అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ప్రాక్టీస్ సెషన్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తుంటే అతని గాయం పూర్తిగా మానిపోయినట్టే అనిపిస్తోంది. టీమ్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ పర్యవేక్షణలో తొలుత తక్కువ రనప్‌తో బంతులు వేసిన భువీ.. క్రమంగా రనప్ పెంచుకుంటూ వెళ్లాడు. దాదాపు 30–35 నిమిషాల పాటు నిర్విరామంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. తన నెట్ సెషన్ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ కూడా అతని బౌలింగ్ తీరును పరిశీలించాడు. నెట్స్‌లో భువీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు. కాగా, కోహ్లీసేన ప్రాక్టీస్‌కు వర్షం అడ్డొచ్చింది. దాంతో, ఆటగాళ్లంతా ఇండోర్‌లో సాధన చేశారు. కోహ్లీ, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా తదితరులు నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్ ఈ సెషన్‌ను పర్యవేక్షించారు.
నెట్ బౌలర్‌గా నవ్‌దీప్ సైనీ
యువ బౌలర్ నవ్‌దీప్ సైనీ ఇండియా టీమ్‌తో కలిశాడు. వరల్డ్‌కప్ స్టాండ్‌బై లిస్ట్ ఉన్న సైనీ జట్టుతో చేరడం, భువీ గాయంపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. అయితే, సైనీ ఏ ఆటగాడికి బ్యాకప్ కాదని, కేవలం నెట్ బౌలర్‌గానే ఇంగ్లండ్‌కు వచ్చాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
