భువీకి గాయం! చికిత్సలో ఎన్‌సీఏ తీరుపై విమర్శలు

భువీకి గాయం! చికిత్సలో ఎన్‌సీఏ తీరుపై విమర్శలు

బెంగళూరు: టీమిండియా స్టార్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌కు మళ్లీ గాయమైందా? ఆగస్టులో వెస్టిండీస్‌‌లో లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ అనంతరం అతను ఆటకు దూరం కావడానికి కారణం అదేనా?  భువీకి సరైన చికిత్స అందించి, ఫిట్‌‌నెస్‌‌ పెంచడంలో నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ (ఎన్‌‌సీఏ) ఫెయిలైందా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి.  భువీకి గాయం అయిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. అతను కండరాల గాయం, పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎన్‌‌సీఏలో స్ట్రెంత్‌‌ అండ్‌‌ కండిషనింగ్‌‌ ప్రోగ్రామ్స్‌‌లో పాల్గొంటున్నాడు. అందుకే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌‌తో సిరీస్‌‌లకు ఏ కారణం చెప్పకుండా సెలెక్షన్‌‌ కమిటీ అతడిని జట్టుకు ఎంపిక చేయలేదని అర్థం అవుతోంది.

సెప్టెంబర్‌‌లో సౌతాఫ్రికాతో టీ20 టీమ్‌‌ను ప్రకటించే టైమ్‌‌లో భువీ గాయాన్ని దాచిపెట్టి ‘అందుబాటులో లేడు’ అని మాత్రమే చెప్పింది. అయితే, ఎన్‌‌సీఏలో సరైన చికిత్స లభించకపోవడం వల్లే భువనేశ్వర్‌‌ త్వరగా కోలుకోలేకపోతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో రిహాబిలిటేషన్‌‌ సరైన పద్ధతిలో జరగకపోవడం వల్ల వికెట్‌‌ కీపర్‌‌ వృద్ధిమాన్‌‌ సాహా సంవత్సరం ఆటకు దూరమయ్యాడన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు భువీ విషయంలోనూ అదే జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌‌ టూర్‌‌ నుంచి వచ్చిన తర్వాత గతేడాది జులై నుంచే స్టార్‌‌ పేసర్‌‌ గాయంతో బాధపడుతున్నాడని సమాచారం.  అయినా వరల్డ్‌‌ కప్‌‌లో ఆడాలని జట్టు కోరడంతో  సరైన చికిత్స లేకుండానే అతను బరిలోకి దిగాడని తెలుస్తోంది. అందుకే గాయం తిరగబెట్టి మరింత పెద్దదైందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌లో ఇండియా ప్రధాన పేసర్లలో భువనేశ్వర్‌‌ ఒకడు. మరికొద్ది నెలల్లోనే టీ20 వరల్డ్‌‌కప్​ జరుగుతుంది కాబట్టి.. అతని విషయంలో బోర్డు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ద్రవిడ్‌‌తో దాదా భేటీ

బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ గంగూలీ, ఎన్‌‌సీఏ హెడ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌తో బుధవారం భేటీ అయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్‌‌ హోదాలో తన టీమ్‌‌మేట్‌‌ ద్రవిడ్‌‌ను కలిసిన దాదా.. అకాడమీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాడు. అకాడమీ విషయంలో తన ఐడియాలను కూడా రాహుల్‌‌తో పంచుకున్నాడు. ఎన్‌‌సీఏ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్స్‌‌లెన్స్‌‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించాడు.