
టీమిండియా ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు జాతీయ జట్టులోకి కంబ్యాక్ ఇస్తాడో చెప్పడం కష్టం. మూడేళ్ళుగా భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నా సెలక్టర్లు ఈ వెటరన్ పేసర్ ను పట్టించుకోవడం లేదు. సూపర్ ఫామ్ లో ఉన్నా కాంపిటీషన్ తట్టుకొని భారత జట్టులో ఎంపిక కాలేకపోతున్నాడు. నిలకడగా రాణించే భువనేశ్వర్ కుమార్ ను సెలక్టర్లు ఎందుకు పక్కన పెడుతున్నారో పెద్ద ప్రశ్నగా మారింది. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ లో ఇప్పటికీ తమ స్వింగ్ తో బెంబేలేత్తిస్తున్న భువీ..భారత జట్టులో మళ్ళీ కనిపిస్తాడా అనే ప్రశ్నకు స్పందించాడు.
భారత జట్టులో తన భవిష్యత్తు గురించి పేసర్ భువనేశ్వర్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. భారత జట్టులోకి తాను తిరిగి రావడం పూర్తిగా సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. భువీ మాట్లాడుతూ.. "నేను భారత జట్టులోని రావడంపై సెలెక్టర్లు సమాధానం ఇస్తారు. నా పని మైదానంలో నా 100% ఇవ్వడమే. నేను అదే చేస్తున్నాను". అని భువనేశ్వర్ దైనిక్ జాగ్రన్‌తో అన్నారు. 33 ఏళ్ల భువనేశ్వర్ 202 చివర్లో టీమిండియా తరపున ఆడాడు. నవంబర్ లో న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయాడు.
ఇండియా తరపున ఇప్పటివరకు 121 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టులు 63 వికెట్లు, 87 టీ20 మ్యాచ్ ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భువనేశ్వర్ కుమార్ ను రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. భారీ ధరకు ఎంపికైన భువీ ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం భువీ ఉత్తర ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. లక్నో ఫాల్కన్స్‌కు కెప్టెన్సీ చేస్తూ తన జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.