ఈ నెల 21న మోడీకి బైడెన్ విందు... పలువురు ప్రముఖులకు ఆహ్వానం

ఈ నెల 21న మోడీకి బైడెన్ విందు... పలువురు ప్రముఖులకు ఆహ్వానం

వాషింగ్టన్: ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. ఈ నెల 21 ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే, విందు ఎక్కడనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. తమ దేశంలో పర్యటించాలని ఇప్పటికే మోడీని బైడెన్, జిల్  బైడెన్  ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోడీకి ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. 

అలాగే ఆత్మీయ విందు తర్వాతి రోజే మోడీకి అధికారిక విందు  (స్టేట్  డిన్నర్) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం వైట్ హౌస్ లో రాత్రి పూట జరగనుంది. వైట్ హౌస్ షెడ్యూల్  ప్రకారం బైడెన్  ఈ నెల 19 నుంచి 21 వరకు కాలిఫోర్నియాలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ 21న న్యూయార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న తర్వాత వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. వైట్ హౌస్ లోని సౌత్  లాన్స్ లో నిర్వహించే స్టేట్  డిన్నర్  కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా, ఇండియా నుంచి 120 మంది వరకు సెలబ్రిటీలకు ఆహ్వానం పంపారు. అయితే ఆ ప్రముఖుల పేర్లు వెల్లడించలేదు. 

23న కమలా హారిస్  ఆతిథ్యం

అమెరికా వైస్ ప్రెసిడెంట్  కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్  కూడా మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 23న ఫాగ్గీ బాటం హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం జరగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మోడీ పర్యటనలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అమెరికా–ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై బైడెన్, మోడీ మధ్య చర్చలు జరుగుతాయని వివరించాయి. బిజీ షెడ్యూల్ పెట్టాలని ప్రధాని మోడీ అడిగారని, ఆ మేరకు  ఏర్పాట్లు చేశామని చెప్పాయి.