తెలంగాణలో రాంచరణ్ ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా..?

తెలంగాణలో రాంచరణ్ ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా..?

రాంచరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్ల పెంపు తెలంగాణలో దాదాపుగా లేనట్టే. జూన్ 4న విడుదలయ్యే 'పెద్ది' సినిమా టిక్కెట్ రేట్లను ఏడు రోజులపాటు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఉపసంహరించుకుంది.

ఈ పిటిషన్పై విచారణ జూన్ 6కి వాయిదా పడింది. పెద్ది సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది. రిలీజ్ డేట్ ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చింది. మళ్లీ వాయిదా వేస్తే సినిమాకు నష్టం జరుగుతుందని భావించిన నిర్మాతలు సినిమా టికెట్ రేట్లు పెంచాలన్న పిటిషన్ను విత్‌డ్రా చేసుకున్నారు. 

టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ ఈ నెల 15న, అనంతరం 25న ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మైత్రీ మూవీ మేకర్స్ తరపున యలమంచిలి రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్ సుద్దాల చలపతిరావు శుక్రవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రతాప్‌‌‌‌కుమార్ వాదనలు వినిపిస్తూ, టిక్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.

చట్టం ప్రకారం అనుమతి ఇవ్వాలా, తిరస్కరించాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టు ధిక్కరణ వ్యవహారం పెండింగ్‌‌‌‌లో ఉందని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. అధికారులను ఆశ్రయించేందుకు స్వేచ్ఛ కల్పిస్తూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా ఆంధ్రాలో పెద్ది సినిమా టికెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ‘పెద్ది’ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600. జూన్ 4 నుంచి జూన్ 13 వరకూ పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై 100 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధరపై 125 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది.