బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. 75వ రోజు ఎపిసోడ్ ఏకంగా రణరంగాన్ని తలపించింది. ఇంటిలో మొదలైన చిన్న కెప్టెన్సీ టాస్క్.. హౌస్‌లో అత్యంత భయంకరమైన గొడవకు దారి తీసింది. ఎప్పటి నుంచో పొగలు కక్కుతున్న దివ్య, తనూజ మధ్య మాటల యుద్ధం కాసేపట్లోనే వ్యక్తిగత దూషణలు, అరవడాలు, వేలు చూపించుకునే స్థాయికి చేరింది. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ చివరకు కొట్టుకునే స్థాయికి వెళ్లింది వారి మధ్య మాట యుద్ధం.
దివ్య ‘ఇమ్యూనిటీ’ లాజిక్.. తనుజ ఔట్!
లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ వారం కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచితొలగించాలనే టాస్క్‌ను బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చారు. దీంతో ఎప్పటిలాగే, దివ్య... తనూజను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగింది. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్‌రెడీ నువ్వు కెప్టెన్‌గా గత వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అనే విచిత్రమైన లాజిక్ చెప్పి తనూజను రేసు నుంచి తొలగించింది. దీంతో తనూజ తీవ్రంగా స్పందించింది. నేను కెప్టెన్సీని కష్టపడి ఆడి గెలుచుకున్నా. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? పవన్, ఇమాన్యుయల్ వంటి వాళ్ళు ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యారు? వారిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అని సూటిగా ప్రశ్నించింది.
గేమ్ కోసం వాడుకోకు!
తనూజ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇరుక్కుపోయిన దివ్య... 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా అంటూ సమర్థించుకుంది. ఆ సమయంలో బానే చెప్పుకున్నావ్ పో అని తనుజ వెక్కిరించడంతో దివ్య మరింత సీరియస్ అయింది. నువ్వెవరు 'పో' అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ వేలు చూపించి మాట్లాడింది. తనూజ కూడా తగ్గకుండా, ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అంటూ ఎదురుదాడి చేసింది. అటు దివ్య కూడా ఆరోపణల స్థాయిని పెంచింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని వ్యక్తిగత ఆరోపణ చేసింది.
కొట్టుకునే స్థాయికి చేరిన గొడవ
మాటల యుద్ధం కాసేపట్లోనే తిట్లు, గట్టి గొంతుతో అరుపులుగా మారిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా వచ్చి ఫింగర్ పాయింటింగ్ చేస్తూ, దాదాపు భౌతిక దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ దివ్య, తనుజ మధ్య టెన్షన్ క్రియేట్ అయింది. ఇతర కంటెస్టెంట్స్ వెంటనే వారిని విడగొట్టేందుకు పరుగులు తీశారు. కానీ ఇద్దరూ ఆగకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు, ఇంటి నియమాలు, గత టాస్క్‌లు, పాత స్నేహాల గురించి బయటపెట్టేసుకుని హౌస్‌ను యుద్ధభూమిగా మార్చేశారు.
భరణి కోసమే టార్గెటింగ్?
అసలు ఈ గొడవకు ప్రధాన కారణం భరణి - తనూజ మధ్య ఉన్న అనురాగమేనని హౌస్‌మేట్స్, ప్రేక్షకుల్లో చాలా మంది గ్రహించారు. భరణి, తనూజ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపడం దివ్యకు ఇష్టం లేదనీ, అందుకే దివ్య తరచూ తనూజను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. దివ్య కేవలం అవకాశవాదిగా ప్రవర్తిస్తూ, తన వ్యక్తిగత వైరాన్ని టాస్క్ అడ్డం పెట్టుకుని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో దివ్య - తనూజ స్నేహం పూర్తిగా ముగిసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు నెగ్గుతారో, ఈ గొడవ తర్వాత వారి ప్రయాణం ఎలా మారుతుందో చూడాలి!
