60 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన రైలు

60 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన రైలు

ప్రపంచంలోనే అతి పెద్ద స్టీమ్‌‌ ఇంజన్‌‌ రైలు 60 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. గుప్పుగుప్పున పొగ కక్కుతూ పరుగుపెట్టింది. అమెరికాలోని విస్కాన్‌‌సిన్‌‌ నుంచి వెస్ట్‌‌ చికాగో వరకు శుక్రవారం నడిచింది. 1869లో మొదలైన ట్రాన్స్‌‌ కాంటినెంటల్‌‌ రైల్‌‌ రోడ్డుకు 150 ఏళ్లయిన సందర్భంగా ఈ ‘బిగ్ బాయ్‌‌ స్టీమ్‌‌ ఇంజిన్‌‌ రైలు’ను మళ్లీ స్టార్ట్‌‌ చేశారు. విస్కాన్‌‌సిన్‌‌ నుంచి షికాగో వెళ్తుండగా అక్కడక్కడ ఆగుతుంటే చూసేందుకు జనం ఎగబడ్డారు. ప్రజలు చూసేందుకు వెస్ట్‌‌ షికాగోలో ఈ శని, ఆది వారాలు ఈ రైలుంటుదని అధికారులు చెప్పారు. తర్వాత మంగళవారం రోచెల్లె, ఇల్లినాయిస్‌‌కు పయనమవుతుందన్నారు.

ఆగస్టు 2న నెబ్రాస్కాలోని ఒమాహాకు చేరుకుంటుందని చెప్పారు. తిరిగి చెయన్నేలోని యూనియన్‌‌ పసిఫిక్‌‌ స్టీమ్‌‌ షాప్‌‌కు ఆగస్టు 8న బయలుదేరుతుందని వివరించారు.1940ల్లో ఈ బిగ్‌‌ బాయ్‌‌ ఇంజిన్లను తయారు చేశారు. అప్పట్లో కేవలం 25 మాత్రమే రెడీ చేశారు. సుమారు 10 లక్షల కిలోమీటర్లు నడిచిన తర్వాత 1961లో ఇంజిన్‌‌ నంబర్‌‌ 4014 రిటైరయింది. దాన్ని దక్షిణ కాలిఫోర్నియాలోని రైల్వే అండ్‌‌ లోకొమోటివ్‌‌ హిస్టారికల్‌‌ సొసైటీకి అప్పగించారు. 600 టన్నుల ఈ ఇంజిన్‌‌ను మళ్లీ రెడీ చేసేందుకు యూనియన్‌‌ పసిఫిక్‌‌ ఇంజినీర్లు రెండేళ్లు శ్రమించారు.