తైవాన్​లో 45 డిగ్రీలు వంగిన బిల్డింగ్ లు..

తైవాన్​లో 45 డిగ్రీలు వంగిన బిల్డింగ్ లు..
  •  భారీ భూకంపం.. 9 మంది మృతి.. 70 మంది గల్లంతు

తైపీ :  భారీ భూకంపం దాటికి తైవాన్​ ద్వీపం చిగురుటాకులా వణికింది. బుధవారం ఉదయం సంభవించిన విపత్తుతో ద్వీపదేశం అతలాకుతలమైంది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 7.4గా నమోదైంది. గ్రామీణ, పర్వతప్రాంతాలైన హువాలియన్ ​కౌంటీ తీరానికి 18 కిలోమీటర్ల దూరం, 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. భూకంపం తీవ్రతకు భవనాలు, ఫ్లైఓవర్లు కొద్దిసేపు ఊగిపోయాయి. 

కొన్ని భవనాలనుంచి శకలాలు రోడ్డుపై వెళ్తున్నవారిపై పడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 70 మంది గల్లంతైనట్టు నేషనల్​ ఫైర్​ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనలతో 24 కొండచరియలు విరిగిపడగా.. 35 రోడ్లు, వంతెనలు, సొరంగ మార్గాలు దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత నేపథ్యంలో తైవాన్​ వ్యాప్తంగా  రైలు సేవలను నిలిపివేశారు. విమానక రాకపోకలకూ అంతరాయం కలిగింది. కాగా, గత 25 ఏండ్లలో ఇదే అతి పెద్ద విపత్తు అని అధికారులు వెల్లడించారు.    

సునామీ హెచ్చరిక జారీ.. ఎత్తివేత

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్​లో భూకంపం సంభవించింది. నగరంలోని ఓ ఫ్లైఓవర్​ కొన్ని నిమిషాలపాటు కదిలింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. మరికొన్నిచోట్ల కూడా బ్రిడ్జిలు కంపించాయి. భవనాలు వంగిపోయాయి. విపత్తు కారణంగా తైవాన్​తోపాటు పొరుగు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. అయితే ప్రభావం ఆస్థాయిలో 
లేకపోవడంతో అధికారులు కొద్దిసేపటికే ఎత్తివేశారు.

45 డిగ్రీల కోణంలో వంగిన భవనాలు

భూకంపం దాటికి హువాలియన్​ కౌంటీలో కొన్ని భవనాలు 45 డిగ్రీల కోణంలో వంగిపోయాయి. గ్రౌండ్​ ఫ్లోర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భూప్రకంపనలు కనిపించగానే స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. పిల్లలను గ్రౌండ్​లోకి తరలించారు. పిల్లలందరికీ ఎల్లో సేఫ్టీహెల్మెట్​లు అందజేశారు. భవనాలనుంచి రాలిపడుతున్న శకలాలనుంచి తమను తాము రక్షించేకునేందుకు కొందరు పిల్లలు పుస్తకాలతో తలను కవర్​ చేసుకోవడం కనిపించింది. కూలిపోయిన భవనాల్లోనుంచి బాధితులను రక్షించేందుకు ఇరుగుపొరుగువారు తీవ్రంగా శ్రమించారు. 

కాగా, మినీ బస్​లో నేషనల్​ పార్క్​కు వెళ్లిన 50 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. భూకంపం తర్వాత ఫోన్​ నెట్​వర్క్​ పనిచేయకపోవడంతో వారితో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. రెండు బొగ్గు గనుల్లో 70 మంది చిక్కుకున్నట్టు తైవాన్​ అధికారులు వెల్లడించారు. ఒక గనిలో 64 మంది, మరో గనిలో ఆరుగుకు చిక్కుకుపోయారని, అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కాగా, భూకంపం ధాటికి నేషనల్​ లెజిస్లేచర్ భవనం సహా పలు పురాతన భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

తైవాన్​ పొరుగు దేశాల్లోనూ భూకంప ప్రభావం

తైవాన్ పొరుగు దేశాలైన చైనా, జపాన్​లోనూ భూకంప ప్రభావం కనిపించింది. చైనా రాజధాని షాంఘై, ఆగ్నేయ తీరం వెంట అనేక ప్రావిన్స్​లలో భూమి కంపించినట్టు ఆదేశ మీడియా వెల్లడించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత యోనాగుని ద్వీపం తీరంలో 30 సెంటీమీటర్ల (సుమారు ఒక అడుగు)లోతులో సునామీ సంభవించినట్టు జపాన్​ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇషిగాకి, మియాకో ద్వీపాల్లో స్వల్ప తరంగాలు కనిపించినట్టు తెలిపింది. అయితే, బుధవారం మధ్యాహ్నానికి సునామీ హెచ్చరికలను జపాన్​ ఎత్తివేసింది. 

మధ్యాహ్నం వరకే తేరుకున్న తైవాన్​

ఉదయం భారీ భూకంపం కుదిపేసినా తైవాన్​ మధ్యాహ్నం వరకే తేరుకున్నది. భూకంపం తీవ్రత తగ్గినట్టు స్కూల్​డ్రిల్స్​, పబ్లిక్​ మీడియా, ఫోన్​ల ద్వారా ప్రజలకు అధికారులు  సమాచారాన్ని చేరవేశారు. దీంతో మధ్యాహ్నం ఉత్తర తైపీ శివారు బైటౌలోని మెట్రో స్టేషన్​ ఉద్యోగులు, ప్రయాణికులు, పర్యాటకులతో బిజీగా మారింది. జనాలు ఇండ్లనుంచి బయటకొచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. జనజీవనం యధావిధిగా కొనసాగింది. కాగా, విపత్తులపై తైవాన్​ సంసిద్ధత ప్రపంచంలోనే అత్యాధునికమైనదని మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్​ అండ్​ టెక్నాలజీ ప్రొఫెసర్​, సెస్మోలజిస్ట్​ స్టీఫెన్​ గావో  వెల్లడించారు.