చైర్మన్​ పీఠం ఎవరికి?  

చైర్మన్​ పీఠం ఎవరికి?  

నల్గొండ, వెలుగు:  నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. డెయిరీపై ‘గుత్తా’ధిపత్యానికి చెక్​ పెట్టి తొలిసారి చైర్మన్​గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డి పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి సపోర్ట్​తో గతేడాది సెప్టెంబర్​లో ఎన్నికైన కృష్ణారెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన్నే చైర్మన్​గా కొనసాగిస్తారనే నమ్మకంతో డైరెక్టర్​ స్థానానికి నామినేషన్​ కూడా వేశారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కృష్ణారెడ్డిని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోం ది. కృష్ణారెడ్డికి గత ఎన్నికల్లో సపోర్ట్​ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ దఫా మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్నిక లు జరుగుతున్న మూడు డైరెక్టర్​స్థానాలు నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే డైరెక్టర్ల ఎన్నిక జరుగుతుంది. దీంతో నకిరేకల్​నుంచి కృష్ణారెడ్డి బదులుగా గుత్తా జితేందర్​రెడ్డి, మందడి ప్రభాకర్​రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. 

వ చ్చే అసెంబ్లీ ఎలక్షన్​లో చిట్యాల మండలంలో గుత్తా బ్రదర్స్​అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే జితేందర్​ రెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలిసిం ది. కానీ జితేందర్​రెడ్డి అభ్యర్థిత్వం పట్ల మంత్రి జగదీశ్​రెడ్డి సానుకూలంగా లేకపోవడంతో రెండో క్యాండేట్​ ప్రభాకర్​రెడ్డికి చాన్స్ ఇవ్వాలని సూచించినట్లు డెయిరీ వర్గాలు తెలిపాయి. సుమారు 13 ఏళ్ల పాటు డెయిరీ చైర్మ న్​గా పనిచేసిన జితేందర్​ రెడ్డి రాష్ట్ర డెయిరీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ పదవి ఆశిస్తున్నారు. కార్పొరేషన్​చైర్మన్​పదవి ఇస్తామని మంత్రి నుంచి హామీ లభించడంతోనే జితేందర్​రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

డెయిరీపై పట్టకు ‘గొంగడి’ యత్నం

మదర్​డెయిరీపై పట్టు సాధించేందుకు ఆలేరు ఎమ్మెల్యే సునీత భర్త, డీసీసీబీ చైర్మన్​ గొంగడి మహేందర్​రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా రు. ఆ నియోజకవర్గం నుంచి బొందుగుల నర్సింహారెడ్డి తర్వాత మళ్లీ చైర్మన్ అయ్యే చాన్స్​ ఎవరికీ రాలేదు. డెయిరీలో ఓటు హక్కు కలిగిన సంఘాలు 278 ఉంటే దాంట్లో 150 పైగా సంఘాలు ఆలేరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో చైర్మన్​ పదవి తమకే ఇవ్వాలని మహేందర్​ రెడ్డి గత ఎన్నికల్లోనే పట్టుబట్టారు. ఈ మేరకు ఆయనే గత ఎన్నికల ఇన్​చా ర్జిగా వ్యవహరించారు. కానీ చివరి నిమిషంలో కృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణారెడ్డిని తప్పించాల్సిన ప రిస్థితి రావడంతో డెయిరీ చైర్మన్ పదవి ఆలేరుకే ఇవ్వాలని పార్టీ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ ఎన్నికల ఇన్​చార్జి బాధ్యతలు కూడా మహేందర్​రెడ్డికే మంత్రి జగదీశ్​రెడ్డి అప్పగించారు. మూడు డైరెక్టర్​ స్థానాలకు 14 మంది నామినేషన్లు వేశారు. ఆశావహులను పోటీ నుంచి తప్పించి డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. శుక్రవారం నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండటంతో ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు గురువారం నుంచే షురూ చేశారు. 

చైర్మన్​ పీఠం ఎవరికి?  

ఆలేరు నియోజకవర్గానికే చైర్మన్​ పదవి ఇవ్వాల్సి వస్తే క్యాండిడేట్​ఎవరనే ది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే. మూడు డైరెక్టర్​పోస్టుల్లో నకిరేకల్, ఆలేరులో ఓసీలకు, భువనగిరి స్థానం బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నా రు. ఇక్కడ నుంచి దాఖలైన రెండు నామినేషన్లు బీసీ వర్గానికి చెందినవే. చైర్మన్​పదవి విషయానికొస్తే మాత్రం ఆలేరు నియోజకవర్గం నుంచే ఐదుగురు డైరెక్టర్లు డెయిరీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లలో సీనియర్లు​ లింగాల శ్రీకర్​రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, అరక్కాల గాలిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గత మూడు టర్మ్​ల నుంచి మాత్రం గాలిరెడ్డి సీనియర్​ డైరెక్టర్​గా కొనసాగుతున్నారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత చైర్మన్​ అభ్యర్థి ఎవరనేది కొలిక్కి రానుంది.