జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ లో భారీ చోరీ జరిగింది. విలేకరి ఇంట్లో దొంగలు పడి 13 తులాల ఆభరణాలు, 80 తులాల వెండి సామగ్రి ఎత్తుకెళ్లారు. జహీరాబాద్ డీఎస్సీ సైదా, ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. జహీరాబాద్ టౌన్ జర్నలిస్టు కాలనీలో ఉండే జె.శ్రీనివాస్ రెడ్డి (స్వేచ్ఛ విలేకరి) కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బంధువుల ఇంట్లో పెండ్లికి వెళ్లారు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి, బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండి..13 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి సామగ్రి పోయాయి.
శ్రీనివాస్ రెడ్డి వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంగారెడ్డి నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వివరాలను సేకరించింది. సోమవారం మరోసారి ఇంటిని పరిశీలించి, సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సైదా తెలిపారు.
